చెఱకు మనకు ముఖ్యమైన వాణిజ్య పంటగా సాగుచేస్తూ ఈ పంట నుండి పంచదార, బెల్లం, ఖండసారి, ఫిల్టర్ మడ్డి, మొలాసిస్, ఇథనాల్ లాంటి ఉత్పత్తులు పొందుతున్నాము. చెఱకులో అధిక దిగుబడికి, ఎక్కువ పంచదార పొందడానికి అనువైన వాతావరణ పరిస్థితులతో పాటు, చెఱకులో అనువైన సాగు రకాలు, సాగు పద్ధతులు, నీటి నాణ్యత, సస్యరక్షణ లాంటి అంశాలు చెఱకు పంటను ప్రభావితం చేస్తాయి.
చెఱకు పంట సాధారణంగా 10-12 నెలల పంట. అంటే దాదాపు సంవత్సరకాల పంట, కాబట్టి చెఱకు పంటకు నీరు దాదాపు 2500 మి.మీ - 3000 మి.మీ వరకు ఒక పంటకాలానికి అవసరమవుతుంది. చెఱకు పంటను పెరిగే దశను బట్టి, బాల్యదశ (0-45 రోజులు), పిలకల దశ (45-120 రోజులు) పెరుగుదల దశ (120-270 రోజులు), పక్వదశ (270-300 రోజులు) వరకు ఇలా దశల వారీగా చెఱకు పంట పెరుగుతుంది. పంట దశలను బట్టి కూడా నీరు అవసరమవుతుంది.
చెఱకు పంటకు నేలను బట్టికూడా నీరు అవసరం అవుతుంది. బంకనేలకు నీటిని పట్టి ఉంచుకొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ నీరు అవసరం అవుతుంది. అదే ఇసుక నేలలు తక్కువ నీటిని పట్టి ఉంచుకునే సామర్ధ్యం ఉంటుంది. కాబట్టి నీరు ఎక్కువ అవసరమవుతుంది. చెఱకులో నీటి ఎద్దడికి తట్టుకునే గుణం కూడా కొంత వరకు ఉంటుంది. చెఱకు పంటలో నీటికి సున్నితమైన దశలు పిలక దశ, పెరుగుదల దశ, మొలక దశ (0-45 రోజులు) లో తక్కువ నీటిని తరచుగా ఇవ్వడం వల్ల మొలక శాతం బాగా వస్తుంది. ఇంకా పక్వదశలో నేలను బట్టి 2-3 వారాలకొకసారి ఇవ్వాలి. చెఱకు పంటకు నీరు అందించడానికి సరైన సమయంలో కరెంటు లేకపోవడం, కూలీలు అందుబాటులో ఉండకపోవడం, నేలలో నీటి సామర్ద్యం తగ్గిపోవడం, బోర్లు, బావులు ఇంకిపోవడం వల్ల చెఱకు పంటకు నీటి యాజమాన్యం మార్పులో బిందుసేద్యం ఒక భాగం.
ఈ పద్ధతిలో నీటిని సన్నని లేట్రల్ పైపుల ద్వారా కావలసిన పరిమాణంలో మొక్కకు అతి దగ్గరలో అందజేస్తారు. డ్రిప్ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం వల్ల మొక్క వేర్ల భాగంలో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన, అధిక దిగుబడినిస్తుంది. అదే విధంగా ఫర్టిగేషన్ అనగా ఎరువులను సాగునీటి ద్వారా పైరుకు అందించడం. ఫర్టిగేషన్ పద్ధతిలో సాగు నీరు మరియు పంటలకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి సమాంతరంగా సూక్ష్మ నీటి పారుదల పద్ధతిలో మొక్కలకు అందించబడతాయి. ఈపద్ధతి వల్ల పంటల దిగుబడులు పెరుగటమే కాకుండా పర్యావరణంపై దుష్ప్రభావాలు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఫర్టిగేషన్ పద్ధతి చాలా రకాల పంటల్లో, వివిధ రకాల నేలల్లో వాతావరణ పరిస్థితుల్లో విస్తృతంగా వాడులో ఉంది. ఫర్టిగేషన్ పద్ధతుల వల్ల పోషకాలను ఖచ్చితంగా మొక్కవేరు వ్యవస్థకు సూటిగా అందించే సౌలభ్యం ఉంది. ఫర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల దశలకు అనుగుణంగా వాటి అవసరాలను ఎప్పటికప్పుడు బేరీజువేస్తూ వేరు ఎదుగుదల, అభివృద్ధి చెందే దశ, పూత మరియు కాపు దశల్లోసిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంటుంది.
ఈ పద్ధతిలో పంట యొక్క పోషకాల అవసరాలను, ఎదుగుదల దశలను అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.
పంటకు కావల్సిన మోతాదులో మరియు అవసరమైన దశల్లో పోషకాల లభ్యత.
పోషకాలు నేరుగా వేర్లకు అందించడం వల్ల పోషకాలు వ్యర్ధం కావు.
పోషకాలు భూమిలో ఇంకిపోవడం, ఆవిరి అవడం అలాగే అలభ్య పోషకాలుగా రూపాంతరం చెందటం లాంటి నష్టాలను ఫర్టిగేషన్ ద్వారా అధిగమించవచ్చు.
ఎరువుల వాడకం 15-40 శాతం వరకు అలాగే కూలీల అవసరం 10-15 శాతం వరకు తగ్గుతాయి.
సాంప్రదాయ పద్ధతుల్లో ఎరువులను వెదజల్లటం, మొక్కల మొదళ్ళలో వేయడం లాంటి పద్ధతులతో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం రెండింతలుంటుంది.
వాలుగా ఉన్న పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ చాలా అనుకూలమైన పద్దతి. అన్నింటికంటే ముఖ్యంగా ఫర్టిగేషన్ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది.
పంట దిగుబడులు దాదాపు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది.
పంట ఉత్పత్తుల నాణ్యత బాగుంటుంది.
ఈ పద్ధతి వల్ల నేల కాలుష్యం కూడా ఉండదు.
ఫర్టిగేషన్ పద్ధతి మూడు రకాలైన పరికరాల ద్వారా ఇవ్వవచ్చు. ఈ పరికరము కంట్రోలు హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఫర్టిగేషన్ పరికరము ద్వారా వచ్చే ఎరువు ద్రావణము మెయిన్ లైన్‌లోని నీటిలో కలిపి ఫిల్టరు ద్వారా మరలా మెయిన్‌లైన్‌లోకి వెళ్ళునట్టు చూడవలెను. ఈ విధంగా చేయడం వల్ల ఎరువు ద్రావణంలో ఉన్న మలినాలు ఫిల్టరు అవుతాయి. ఫర్టిగేషన్ పద్ధతి, ఫర్టిగేషన్ ట్యాంకు, వెంచురీ లేక ఫర్టిగేషన్ పంపు ద్వారా ఇవ్వవచ్చు. ఫర్టిగేషన్ ట్యాంకు లేక వెంచురి ఖరీదు తక్కువ కాబట్టి రైతులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేకుంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్ప రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి. ఫర్టిగేషన్ పద్ధతిలో పొడి రూపంలో (లేదా) ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. మంచి నాణ్యత మరియు దిగుబడులు సాధించడానికి క్లోరైడ్‌లు లేనటువంటి ఎరువులును ఎంపిక చేసుకోవాలి.
వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్ళపల్లిలో చెఱకు పంటపై బిందు సేద్యం యొక్క ఆవశ్యకత మరియు బిందు సేద్యం ద్వారా ఎరువులను అందించడంపై పలు ప్రయోగాలు జరిపి క్రింది ఫలితాలను నిర్ధారించారు.
చెఱకు పంటను జంట సాళ్ళలో సాలు అంటే 60 సెం.మీ. సాలు సాలుకీ మధ్య దూరం, జంట జంటకీ 120 సెం.మీ. దూరంలో సాలు చేసి నాటుకోవాలి. ఈ 60 సెం.మీ. సాలులో డ్రిప్ లేట్రల్ వేసి డ్రిప్పర్ల ద్వారా చెఱకు పంటకు నీరు అందించినప్పుడు 30% నీటి ఆదాతోపాటు 25% చెఱకు దిగుబడి అదనంగా నమోదు చేయబడుతుంది. ఇలా జంట సాళ్ళ పద్ధతిలో చెఱకును నాటుకోవడంవల్ల పంటకు గాలి, వెలుతురు బాగా ప్రసరించజం జరుగుతుంది. తోటలోనికి దూరి అంతర కృషి చేయడానికి వీలుగా ఉంటుంది. బిందు సేద్యం ద్వారా చెఱకు పంటకు నీరు అందించడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు నీరు బాగా అందుతుంది. తద్వారా గడల సంఖ్య పెరిగి దిగుబడి పెరిగింది.
చెఱకు పంటకు నీటిలో కరిగే ఎరువులైన మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, 19:19:19 మరియు మల్టీ కె లను నీటితో పాటు 100 శాతము సిఫారసు చేసిన మోతాదుల్లో కొద్ది కొద్ది పరిమాణంలో చెఱకునాటిన 30 రోజుల నుండి 150 రోజుల వరకు పంపించినప్పుడు పంట అందించిన ఎరువులను సక్రమంగా వినియోగించుకొని పిలకల సంఖ్య, గడల సంఖ్య మరియు గడల బరువు పెరిగి చెఱకు దిగుబడి దాదాపు 15 శాతం వరకు పెరుగుతుంది.
చెఱకులో 125% సిఫారసు చేసిన యూరియా మరియు మ్యూరెేట్ ఆఫ్ పొటాష్‌లను 12 భాగాలుగా చెఱకు నాటిన 35 రోజుల నుండి 150 రోజుల వరకు బిందు సేద్యం ద్వారా అందించినప్పుడు చెఱకు దిగుబడి (10.7 ట/హె) రాగా అదేవిధంగా సిఫారసు చేసిన ఎరువును నేలకు అందించినప్పుడు చెఱకు దిగుబడి (94.6 ట/హె) నమోదు చేయబడినది. సిఫారసు చేసిన పద్దతిలో ఎరువును అందించినప్పటి కంటే బిందు సేద్యం ద్వారా ఎరువులను అందించినపుడు 13 శాతం అధిక సరాసరి చెఱకు దిగుబడులు నమోదు చేయబడ్డాయి.
డా|| యన్.వి. సరళ, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనాస్థానం, సేధ్యపు విభాగం, పెరుమాళ్ళపల్లె, ఫోన్ : 8790638715