ప్రపంచ వ్యాప్తంగా సమాచార సాంకేతిక విప్లవం నూతన ఒరవడికి దారి తీస్తుంది. అన్ని రంగాల్లోనూ సంచలనాత్మకమైన, సృజనాత్మకమైన ప్రగతి దారులకు బాటలువేస్తుంది. మొత్తంగా ప్రపంచాన్ని ఒక వసుధైక కుటుంబంగా, ఒక అతిపెద్ద గ్రామంగా మార్చివేయడంలో ఈ విప్లవం సఫలమైంది. ఈ విప్లవ విజయ ఫలితంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల సరిహద్దులు లేకుండా కొండకోనలు, ఎడారులు, సముద్రాలు, నదీనదాలు మనకి అడ్డంకి కాదంటూ... పదండి పోదాం ముందుకు అనే స్పూర్తితో ఆబాల గోబాలం ప్రగతి దారులను వెతుక్కుంటూ ముందుకు, మున్ముందుకు సాగుతుంది. ఈ యాత్రలో రైతులు తాము మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలనే తపనతో ముందు యుగం దూతల్లాగా దూసుకు వెళుతున్న వైనాన్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాం.
సమాచార సాంకేతిక విప్లవంలో భాగంగా సామాజిక మాధ్యమాల బాధ్యత విస్తారంగా పెరిగింది. వ్యవసాయేతర కార్పోరేట్ శక్తుల చేతిలో బందీలైన పత్రికలు, సమాచార, ప్రసార సాధనాల వివక్షతకు తాము తలొగ్గబోమంటూ రైతులు సైతం ఈ మాధ్యమాల్లో తమ విశిష్టమైన వ్యవసాయ, సాగు పద్ధతులను ఉంచడం ద్వారా తాము సైతం విప్లవాగ్నికి సమిధులను ఆహుతిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు అందించే ఆధునిక సాంకేతిక సమాచారం ఆధారంగా తమ విజయ కథనాలను వీటిలో నిక్షిప్తం చేయడం ద్వారా అంతర్జాలం ద్వారా విస్తరిస్తున్న విశాల విశ్వ విజ్ఞాన సర్వస్వంలో తామూ ఒక భాగమని వ్యవసాయం దండగ కాదు పండుగని నిరూపిస్తున్నారు.
ఈ రంగంలో విశేషమైన సేవలను అందిస్తున్న అగ్రిక్లినిక్ మాసపత్రిక, అంతర్జాలంలోనూ, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ రైతు విజయాలకు సంబంధించిన కథనాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విశ్వజనీనమైన సమాచార పంపిణీ ద్వారా రైతులు, ప్రభుత్వాలు, వ్యవసాయ సంబంధిత రంగాలు, సేవా సంస్థలు, పరిశోధనాశాలల మధ్య వారధిగా నిలుస్తున్నది. ఈ నేపధ్యంలో ప్రముఖ సామాజిక మీడియా సంస్థ యూట్యూబ్‌లో ఉంచిన రైతు గాధలు, విజయ పరంపరలను నెటిజన్లు ఎలా స్వీకరిస్తున్నారో, ఆ కథనాలు వ్యవసాయం దండగ కాదు, పండుగని నిరూపించే దృష్టాంతాలపై ప్రముఖ జాతీయ పత్రిక 'ఎకనామిక్ టైమ్స్'లో వచ్చిన కథనాన్ని రైతుల, వ్యవసాయ సంబంధిత రంగాల, సంస్థల అవసరార్థం ఇక్కడ యధాతధంగా తెలుగులో అనువదించి ప్రచురిస్తున్నాము. ఆ కధనం ఇలా......
భారతదేశంలోని పశు సంపదకు, ఉత్తమ పశు పోషణకు, ఒక రకంగా చెప్పాలంటే పాల విప్లవానికి రాజధాని హర్యానా రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని అంబాలా నగరంలో పశుపోషణ ఒక ప్రధాన ప్రక్రియ. హర్‌విలాస్‌సింగ్ అనే రైతు ఉత్తమ పశుపోషకుడు. అలాగే పశుపోషణలో తన విజయాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో నిక్షిప్తం చేస్తుంటాడు. పాడి పశువులకు 24 గంటలపాటు ఉపయోగపడే ఒక పెద్ద నీటి తొట్టెను ఆధునిక పద్ధతిలో నవీకరించి అందుబాటులో నీరు ఉంచడాన్ని వీడియో రూపంలో ఈ రైతు యూట్యూబ్‌లో నిక్షిప్తం చేశాడు. 5.1 మిలియన్ల సంఖ్యలో ఇప్పటి వరకు నెటిజన్లను ఆకట్టుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దృశ్య శ్రవణ వీడియోను ఆకర్షణీయంగా చిత్రీకరించి, ఎడిట్ చేసి, ఒక ప్రముఖ వ్యవసాయ ప్రసార మాధ్యంలో ఉంచిన ఘనుడు కూడా దర్శన్‌సింగ్ అనే పశుపోషకుడే కావడం విశేషం.
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక అభ్యుదయ రైతు సంతోష్ జాదవ్ యూట్యూబ్‌లో నిక్షిప్తం చేసిన మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కూరగాయల పంటల్లో నీటియాజమాన్య పద్ధతులను రెయిన్‌పైప్ ఇరిగేషన్ విధానం ద్వారా మెరుగైన పద్ధతిలో వినియోగించడాన్ని వీడియోతీసి దాన్ని యూట్యూబ్‌కు అనుసంధానం చేయడం ద్వారా 5 లక్షల మంది దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కొరకు మరో 200 మంది సందేశాలు పంపించారు.
ఇలా యూట్యూబ్‌లో వీడియోలను నిక్షిప్తం చేయడం, వ్యవసాయ సాంకేతికతను విశ్వవ్యాప్తం చేయడం, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, ఇతర పధకాలను రైతులకు చేరవేయడం వంటి మహత్తర కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువకులే ఉండడం విశేషమని జాదవ్ చెబుతున్నారు. అలాగే కలుపు నివారణ, నియంత్రణతో ఎరువుల వినియోగం వంటి అంశాలపై అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ కెమేరాలను వినియోగించుకోవడం, వాటిలో అంతర్లీనంగా నిర్మితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొని మెరుగైన రీతిలో వీడియోలను ఎడిట్ చేసుకోవడంలో కూడా రైతు యువకులు మెరుగైన పరిణతిని ప్రదర్శిస్తున్నారని జాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
26 సం||ల సంతోష్ జాదవ్ 2018లో ఇండియన్ ఫార్మర్ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి తన స్నేహితులు, ఇతర రైతు శ్రేయోభిలాషుల సహకారంతో సాంద్ర వ్యవసాయ పద్ధతులను ఛానళ్ళలో నిక్షిప్తం చేయడం ద్వారా రైతులకు ఎంతో సేవ చేస్తున్నారు. కేవలం సామ్‌సంగ్ గెలాక్సీ జె7 అనే మొబైల్ ద్వారా చెరకు పంట యాజమాన్యంలో చేపట్టవలసిన మెరుగైన పద్ధతుల వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల మంది అభిమానించారని, ఇప్పుడు వ్యవసాయ రంగంపై మక్కువ ఉన్న ఒక స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన సొమ్ముతో కెనాన్ డిఎస్‌ఎల్‌ఆర్ కెమేరాను కొని షూటింగ్, ఎడిటింగ్‌కు వినియోగిస్తున్నారని తెలిపారు.
యూట్యూబ్ ఛానల్‌లో తన బొప్పాయి పంటపై పెట్టిన ఒక వీడియో అతన్ని నైజీరియా దేశానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. నందకిశోర్ ధాఖడ్ అనే ఒక రైతు ఈ అరుదైన అవకాశాన్ని పొందాడు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాలోని భీంసుఖ్ గ్రామానికి చెందిన ఈ రైతు ''ఫైవ్ సీక్రెట్స్ ఆఫ్ పపయ్యా ఫార్మింగ్'' అనే వీడియోను తొలుత నైజీరియాకు చెందిన ఒక రైతు చూసి ధాఖడ్‌కు తమ దేశానికి వచ్చి ఇక్కడి వ్యవసాయ పద్ధతులను చూసి సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. ముఖ్యంగా బొప్పాయిలో వచ్చే తెగుళ్ళ నివారణ అంశాలపై తమ రైతులతో మాట్లాడవలసిందిగా ఆయన ఆహ్వానించారు. దేశీ ఖేతీ ఛానల్ అనే యూ ట్యూబ్ ఛానల్‌ను నిర్వహించే ఈ రైతు 10 రోజుల పాటు నైజీరియాలో పర్యటించి అక్కడి రైతులతో మమేకమయ్యారు. 1.5 లక్షల మంది ఖాతాదారులున్న ఈ ఛానల్‌ను నిర్వహించే ధాఖడ్ చదువు కేవలం ఇంటర్‌మీడియేట్ మాత్రమే. 2017 నవంబరులో ఇతను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. రైతుగా అనేక వినూత్నమైన వ్యవసాయ ప్రక్రియలు పాటించి పంటలో నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం వంటి అంశాలపై పరిపూర్ణత సాధించిన ధాఖడ్ విశిష్టమైన రీతిలో రైతులకు అందుబాటులో ఉంటూ, విశేషమైన రీతిలో సొంత ఛానల్ అధినేతగా సంచలనాలు సృష్టిస్తున్నారు.
వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే నిక్షిప్తం చేయడం కాకుండా, ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల్లో రైతు గ్రూపులు, పంటల వారీ గ్రూపులు, ఇంటి పంటల గ్రూపులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాలంలో రైతు శక్తి ప్రభావితంగా మారింది. ఇప్పటికీ నూటికి 50 శాతం మంది పౌరులు, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న వారిలో ఎక్కువ మంది నిరక్ష్యరాసులే కావడం విశేషం. పరస్పర సహకారంతో వారిని విద్యావంతులుగా చేయడమే లక్ష్యం కావాలంటున్నారు జాదవ్
- వై.వి. నరసింహారావు, అసోసియేట్ ఎడిటర్