కర్నూలు జిల్లాలో పత్తిని ఎక్కువ విస్తీర్ణంలో ముఖ్యమైన పంటగా పండిస్తున్నారు. పత్తి పంటలో ఎకరానికి దాదాపు 1.5-2 టన్నుల పత్తి కర్ర లభిస్తుంది. లభ్యమైన పత్తి కర్రను రైతులు వధాగా కాల్చివేస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడుతూ సేంద్రీయ ఎరువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో పశువుల ఎరువు తగ్గిపోయింది. అందువల్ల ఎక్కువ మొత్తంలో లభించే పంట అవశేషాలను ఉపయోగించి వర్మికంపోస్ట్ తయారు చేసుకున్నటైతే ఎక్కువ మొత్తంలో సేంద్రీయ ఎరువులు వాడటానికి వీలవుతుంది. దీనివల్ల నేల భౌతిక మరియు రసాయనిక గుణాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
పత్తి ఏరిన తరువాత పత్తి మొక్కలను వేరుతో సహా ఊడపెరికి ఒక దగ్గర పొగుచేయాలి. నీటివసతి ఉన్న దగ్గర ఇటుకలతో 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు మరియు 30-50 అడుగుల పొడవు ఉన్న కుండీలను కట్టుకోవాలి. కుండీలో అడుగున కొంచం మట్టి పోసి గట్టిగా చేయాలి. ఎండ తగలకుండా మరియు వాన పడకుండా షెడ్‌ను వేసుకోవాలి.
ఊడ పెరికిన పత్తి కర్రలను కుండీల దగ్గర తెచ్చి చొప్ప నరికే యంత్రంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఆవుల పేడను వారం రోజులుగా ప్రోగుచేసి ఉంచుకోవాలి. ఈ విధంగా పత్తి కర్ర ముక్కలు మరియు పేడను సిద్దం చేసుకున్న తరువాత వీటిని కుండీలలో నింపాలి. మొదటిగా ఒక అడుగు మందం వరకు కుండీల్లో పత్తి కర్ర ముక్కలను నింపి వాటిపై పేడ నీటిని పోస్తూ తడపాలి. మళ్ళీ ఒక అడుగు మందం పత్తి కర్ర ముక్కలను నింపి పేడ నీటితో తడపాలి.
ఈ విధంగా కుండీపైన ఒక అడుగు ఎత్తు వరకు పత్తి కర్ర ముక్కలను పరిచి రోజు కొద్దిపాటి నీటితో తడుపుతూ కుండీల్లో ఎప్పుడూ తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. నీరు మరీ ఎక్కువగా పోయరాదు. దాదాపు 20-25 రోజుల్లో పత్తికర్ర ముక్కలు కుళ్లిపోతాయి. ఇలా కుళ్ళిపోయిన పత్తికర్ర ముక్కలు వానపాములు తినటానికి అనువుగా మెత్తగా మారుతాయి. ఇప్పుడు కుండీపై దాదాపు 20 కిలోల వానపాములను వదలాలి. 20-25 రోజుల్లో వానపాములు కుళ్ళిపోయిన పత్తికర్ర ముక్కలను తింటూ నాణ్యమైన వర్మికంపోస్ట్‌గా మారుస్తాయి.
ఈ పద్దతి ద్వారా వర్మికంపోస్ట్ తయారు చేయడానికి అవసరమైన పదార్థం (పత్తికర్ర) ఒకేసారి ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ ఎరువును సులభంగా తయారు చేసుకోవచ్చు. వర్మికంపోస్ట్ తయారైన వెంటనే పొలంలో వేయవచ్చు.
బి. షైనీ ప్రియాంక, రీసర్చ్ అసోసియేట్ (సస్య రక్షణ), ఎస్. నజ్మ, రీసర్చ్ అసోసియేట్ (సస్య ఉత్పత్తి), డా|| జి. ప్రసాద్ బాబు, సమన్వయ కర్త, కె. రాఘవేంద్ర (ఎస్.ఎమ్.ఎస్, విస్తరణ), ఏరువాక కేంద్రం, బనవాసి