డెండ్రోబియం అనే ఆర్కిడ్ జాతి సాగులో మొక్కల ఎంపిక, రకాలు, సాగుకు అనువైన వాతావరణం, పెంచువిధానం గురించిన సాంకేతిక విషయాలు ఇది వరకే ప్రచురితమయ్యాయి. మొక్కలు నాటిన తరువాత తీసుకొనబోవు ఇతర యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్కిడ్ మొక్కలు పూతకు రాక ముందు తాజాగా సేకరించిన పచ్చి పశువుల పేడ 1 కిలో తీసుకొని దాన్ని 5 లీ. నీటికి వంతున కలిపి 2-3 రోజులు బాగా నానబెట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాగా కలియబెట్టాలి. 3 రోజుల తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. వడగట్టిన ప్రతిసారి నీళ్ళు కలిపి మంచి తేట లాంటి ద్రావణం 5 మి.లీ. / లీ. నీటికి వంతున కలిపి ఆర్కిడ్ మొక్కలపై సాయంత్రం పూట మొక్కలంతా ముఖ్యంగా ఆకుల కింది భాగాన తడిచేవిధంగా పిచికారి చేయాలి. పిచికారి చేసిన తరువాత 15-20 రోజులకు తిరిగి చేయవచ్చు. వర్మివాష్ 25 మి.లీ. / లీ. నీటికి చొప్పున కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై పిచికారి చేయాలి.
మంచి నాణ్యమైన 100 గ్రా. వేపపిండి + 100 గ్రా. వేరుశనగ పిండి + 100 గ్రా. ఎముకల పొడిని 2 లీటర్ల నీటిలో 3-4 రోజులు నానబెట్టి తరువాత 10-15 సార్లు బాగా వడకట్టగా మిగిలిన తేట ద్రావణం 10 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై పిచికారి చేయాలి. తాజాగా సేకరించిన ఆవు మూత్రం 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
డెండ్రోబియం ఆర్కిడ్ మొక్కలు నాటేటప్పుడు ముందుగా నాణ్యమైన ఎముకల పొడి 15 గ్రా.లను లీటరు నీటిలో నానబెట్టి బాగా కరిగిన తరువాత 50-75 మి.లీ. ద్రావణాన్ని మొక్కల వేర్లపై పిచికారి చేయవచ్చు.
ఆర్కిడ్ మొక్కల శాఖీయ దశలో ఉన్నప్పుడు నత్రజనిని ఎక్కువగానూ, భాస్వరం, పొటాష్‌లను తక్కువగానూ అందించాలి. అందువల్ల కేవలం నీటిలో కరిగే ఎరువులైన అమ్మోనియం నైట్రేట్ + ఆర్థోఫాస్పరిక్ ఆమ్లం + పొటాషియం నైట్రేట్ ఎరువుల మిశ్రమాన్ని 3:1:1 నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని 2-3 గ్రా. / లీటరు నీటిలో కలిపి మొక్కలు పుష్పీకరణ దశకు వచ్చే వరకు సాయంత్రం 4 గం|| తరువాత వారానికి 2 దఫాలుగా మొక్కలపై బాగా పిచికారి చేయాలి.
మొక్కలు పుష్పీకరణకు వచ్చిన తరువాత అమ్మోనియం నైట్రేట్ + ఆర్థోఫాస్పరిక్ ఆమ్లం + పొటాషియం నైట్రేట్‌లను 1:2:2 నిష్పత్తిలో కలుపుకొని 2-3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కలపై వారానికి 2 సార్లు పిచికారి చేయాలి.
పైన తెల్పిన దానితోపాటుగా మొక్కలు పూర్తిగా పుష్పించడం మొదలు పెట్టినప్పుడు ప్రతిసారి రెండు దఫాలుగా 13:27:27 లేదా 0:52:34 లేదా 13:0:45 వంటి నీటిలో కరిగే ఎరువుల్లో ఏదో ఒకదాన్ని 5 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
సేంద్రియ ఎరువులను మొక్కలపై పిచికారి చేసినప్పుడు మొక్క ఆకులు (పాతవి) లేత పసుపు రంగుకు మారినప్పుడు దాని పిచికారి ఆపాలి. నేరుగా ఎటువంటి ఎరువులను వేరు, మొక్కపై వేయరాదు.
యూరియా సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ ఎరువులను మొక్కల వేర్ల దగ్గర వేయరాదు. పైన సూచించిన విధంగా ఎరువులను నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేయాలి. మొక్కలపై హార్మోనుల వాడకం.
బెంజైల్ అడెనైన్ 50 మి.గ్రా. / లీ. నీటికి మరియు జిబ్బరెల్లిక్ ఆమ్లం 10 మి.గ్రా., లీటరు నీటికి కలిపి విడివిడిగా ఒక్కొక్క హార్మోను విడిగా ఒక్కొక్క నెల నీటిలో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
పైన తెలిపిన నీటిలో కరిగే ఎరువులు నేరుగా ప్యాకెట్లలో ''కేరళ''లో దొరుకును
సాధారణంగా తేమ, ఉష్ణోగ్రత కలగలిపిన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఈ మోక్కలు బాగా పెరుగుతాయి. వాడే నీరు లవణాలు, ఇతరత్రా హానికర కారకాలను కలిగి ఉండకుండా నీటి ఉదజని సూచిక 5.5-6.5 ఉండాలి. మంచి నీరు వాడాలి.
షేడ్‌నెట్‌హౌస్ - డబుల్ లెవల్ మరియు పాలిహౌస్‌లలో వాతావరణ పరిస్థితులను బట్టి జులై, ఫిబ్రవరి వరకు ప్రతిరోజూ ఉదయం - సాయంత్రం 4 గంటలకు ¬స్ పైపుతో ఎక్కువగా ప్రెజర్‌తో కాకుండా పలుచగా మొక్కలపై నీటిని చల్లాలి. పూల దశలో చాలా జాగ్రత్తగా పైపుతో మొక్కలపై నీటిని చల్లాలి. వేసవిలో రెండు రకాల హౌస్‌లలో ప్రతి రోజూ ఉదయం, మద్యాహ్నం మరియు సాయంత్రం 4 గం||లకు ¬స్‌పైపుతో మొక్కలపై నీటిని జాగ్రత్తగా చల్లాలి. పాలిహౌస్‌లలో అయితే వాతావరణ పరిస్ధితులను బట్టి వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉన్న మిగతా రోజుల్లో మిస్టర్స్ లేదా ఫాగర్స్ పద్ధతిలో నీటితడిని అందించవచ్చు.
వేసవికాలంలో మరియు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న రోజుల్లో షేడ్‌హౌస్ మరియు పాలిహౌస్‌లలో ఇసుక కప్పిన నేల భాగాన్ని నీటితో బాగా తడుపుతూ ఉండాలి. దీనివల్ల మొక్కలకు చల్లదనం అందుతుంది.
మొక్కల ఆకులపై పూలలో మరియు ముఖ్యంగా వేరు వ్యవస్థ, కుండి అడుగు భాగాన ఏ మాత్రం నీరు నిల్వ ఉండరాదు. కేవలం మొక్కలకు తేమ అందేటట్లు చూసుకోవాలి. మొక్కలకు వాడే నీరు నాణ్యమైనదిగా ఉండాలి. ఉప్పు నీటిని ఎంత మాత్రం వాడరాదు. పైపులను మారుస్తూ ఉండాలి. ఆర్కిడ్ మొక్కలు పెరుగుతున్న సమయంలో మొక్కల పెరుగుదల పాలిహౌస్ మరియు వాటి బయటి వాతావరణ పరిస్థితులను అనుసరించి షేడ్‌నెట్‌హౌస్ మరియు పాలిహౌస్ లోపల వాతావరణం మొక్కలకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. లోపల ఎక్కడా గడ్డి, పాచి లేకుండా చూడాలి. నేలపై పాచి పెరగకుండా చూడాలి. వేసవికాలంలో పాలిహౌస్‌ల పైభాగాన రాళ్ళ సున్నం పిచికారి చేయాలి. అవసరమైనప్పుడు ప్రతి 2-3 సం|| ఒకసారి కుండీలను మార్చుకోవాలి. ముఖ్యంగా కుండీ మిశ్రమంలో పాచి లేకుండా చూసుకోవాలి.
తామరపురుగులు, పేనుబంక మరియు నల్లి వంటి పురుగులను ''సిస్టెమిక్'' పురుగు మందులను పిచికారి చేసి అదుపులో ఉంచవచ్చు. మెటాల్డిహైడ్ విషపు ఎరను వినియోగించి నత్తలను నివారించాలి. ఆకుమచ్చ లాంటి ఫంగస్ తెగుళ్ళను కార్బండిజమ్ + మాంకోజెబ్ కలసి ఉన్న మందును 1.5 గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి బ్యాక్టీరియా మెత్తటి కుళ్ళును నివారించాలి.
సాధారణంగా పూల కాడ పొడవు 40-50 సెం.మీ. ఉండి పూల కాడలో సరాసరి 8-12 పూలు ఉండి (వాణిజ్య సరళిలో) పూల కాడ పైభాగాన 1-2 మొగ్గ దశలో ఉన్నప్పుడు పూల కాడను సన్నని కత్తితో మొక్క నుండి వేరు చేయాలి.
40 సెం. వద్ద 3 గంటల పాటు ప్రీ - కూలింగ్ చేయాలి. బిఎ 75 పి.పి.యం + సుక్రోస్ 6 శాతం వాటి 8 గంటలపాటు పల్సింగ్ చేయాలి. కత్తిరించిన పూల కాడల కింది భాగంకు 8 హెచ్‌క్యూసి 200 పి.పి.యం పత్తికి అద్ది కత్తిరించిన భాగానికి రబ్బరు బ్యాండ్‌తో చుట్టుకోవాలి.
పూల కాడలను జాగ్రత్తగా 'పాలిథీన్ స్లీవ్'లలో ఉంచి కవర్ చేసుకోవాలి. తరువాత కార్ట్‌బోర్డ్ బాక్సుల్లో ప్యాక్ చేయాలి. 130 సెం.గ్రే వద్ద స్టోర్ చేయాలి. నిల్వ ఉంచడానికి 8 హెచ్‌క్యూసి 300 పిపియం + సుక్రోస్ 6 శాతం కలిపి కొన్ని రోజులపాటు పూల కాడలో పూలను తాజాగా నిల్వ ఉంచవచ్చు.
డెండ్రోబియం ఆర్కిడ్ పూలు వివిధ రకాలుగా ముఖ్యంగా పూల అలంకరణ, బొకేల్లో, వివిధ అలంకరణలో మరియు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులు దీని గురించి తెలుసుకొని కొంతమంది వీటి సాగుకు సమాయత్తం కావాలని కోరుకుంటున్నారు.
డా|| ఎం. రాజానాయక్, ఉద్యాన కళాశాల, అనంతరాజు పేట, కడప, ఫోన్ : 8897998978