భారత వ్యవసాయ పరిశోధనా రంగంలో అగ్రగణ్యుడు డా|| మంగిన వెంకటేశ్వరరావు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. స్వాతంత్రోద్యమానికి ముందునుండి దేశ వ్యవసాయ స్థితిగతులను ఔపోసన పట్టి ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐ.సి.ఎ.ఆర్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు బాధ్యుడిగా ఉంటూ, దేశంలోని పంత్‌ నగర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయ స్థాపకుడిగా పులులు, సింహాలు తిరిగే హిమాలయ పర్వత శ్రేణులను సాగులోకి తెచ్చిన ఘనుడు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో సన్నిహితంగా ఉంటూ, నోబెల్‌ బహుమతి గ్రహీత డా|| నార్మన్‌ బోర్లాగ్‌ శిష్యుడిగా గోధుమ పంటపై విశేష పరిశోధనలు జరిపి కీర్తి కిరీటాన్ని అధిరోహించిన తెలుగుతేజం డా|| ఎం.వి.రావు.

గోదావరి జిల్లాలో జన్మించి భారత వ్యవసాయ విప్లవంలో కీలక పాత్ర వహించిన డా|| ఎం.వి. రావు గత సంవత్సరం పరమపదించారు. ఆయన ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నప్పుడే అగ్రిక్లినిక్‌ మాసపత్రిక సంపాదకులు ఏలూరి సాంబశివ రావు అక్కడ అధ్యయనం చేశారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదాంకితుడ్ని చేయగా, డా|| వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సేవలు వినియోగించుకునేందుకు శాసన మండలి సభ్యునిగా నియమించారు. అగ్రిక్లినిక్‌ మాసపత్రిక జూన్‌ 2010న ప్రారంభించిన సందర్భంలో తొలి సంచికకు ఆయన ఇచ్చిన ఇంటర్వూను అంతర్జాతీయ విత్తన సదస్సు సందర్భంగా ప్రచురించడానికి నిర్ణయించాము. విత్తన రంగానికి ఆయన చేసిన కృషి ఈ ఇంటర్వ్యూలో విశేషంగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

''వ్యవసాయం సమృద్ధిగా ఉందని భావిస్తే విత్తన కార్యక్రమం పటిష్టంగా ఉందని అర్ధం. విత్తన కార్యక్రమం బలహీనంగా ఉందంటే వ్యవసాయరంగం బలహీనమైనట్లే. వ్యవసాయ రంగం కుంటుబడితే ఆహారభద్రత లేనట్లే. ఆహారభద్రత లేనినాడు జాతీయ భద్రత కరువైనట్లేనని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా||ఎం.వి రావు'' అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్రిక్లినిక్‌ మాసపత్రిక తొలిసంచికలో పత్రిక ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేసి నోబెల్‌ బహుమతి గ్రహీతైన నార్మన్‌ బోర్లాగ్‌, డా|| స్వామినాథన్‌ల సాహచర్యంలో తన అనుభవాలను వివరించారు.

ఆ 15 గ్రాముల గోధుమ విత్తనాలే...

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో బెంగాల్‌లో ఏర్పడిన డొక్కల కరువు లక్షల మందిని కబళించివేసిన సంఘటన అనంతరం దక్షిణ భారతదేశంలో 30 లక్షల మంది ఆహార కొరతతో మరణించడం నాటి ప్రధాని జవహర్‌లాల్‌ని కలచివేసిందని దాని పర్యవసానంగా ఆయన శాశ్వత కరువు నివారణకు జల వనరుల వినియోగంతోపాటు సస్యరక్షణకు, ఉత్పత్తి పెంపునకు పరిశోధనల అవశ్యాన్ని గుర్తించారని దానినుగుణంగా వ్యవసాయ విధానాన్ని రూపొందించారని ఆ ఇంటర్వూలో డా|| రావు తెలిపారు.

దేశ సార్వభౌమత్వానికి విరుద్దంగా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న నిబంధన పి.ఎల్‌ 480కి చరమగీతం పాడాలని, జాతి ఆత్మగౌరవానికి ఈ విధానం భంగకరమని భావించిన నెహ్రూ ప్రాధాన్యతాంశంగా దేశంలో బహుళార్ద సాధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, భాక్రానంగల్‌, నాగార్జునసాగర్‌ వంటి ఆధునిక దేవాలయాల నిర్మాణంతో భారత వ్యవసాయ విప్లవానికి శ్రీకారం జరిగిందని డా|| రావు తెలిపారు.

భారత ప్రభుత్వం నదీజలాల వినియోగంతోపాటు, మేలురకం విత్తనాల తయారీ ద్వారా గోధుమ, వరి ఉత్పత్తి పెంపుకు కృషి ప్రారంభించిందని తెలిపారు. ఈ దశలోనే తనకు అమెరికన్‌ శాస్త్రవేత్త నార్మన్‌బోర్లాగ్‌్‌తో ఏర్పడిన పరిచయం, భారత వ్యవసాయ విప్లవానికి ఎంతో తోడ్పడిందని తెలిపారు.

భారత్‌లో ఆహారభద్రత కొరకు అనుసరించాల్సిన విత్తన విధాన కమిటీ బాధ్యుడిగా గోధుమల్లో 1500 రకాలపై పరిశోధనలు చేపడుతున్న నేపథ్యంలో నార్మన్‌బోర్లాగ్‌ తనకు 15 గ్రాముల గోధుమ విత్తనాలను అమెరికా నుండి పంపించారని తెలిపారు. ఈ 15 గ్రాములను వృద్ధి చేసి భారత్‌లో ప్రవేశ పెట్టగా అనూహ్యంగా ఆ విత్తనం విజయవంతమై ''ఇంతింతై వటుడింతై'' సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో మిలియన్‌ టన్నుల గోధుమల ఉత్పత్తి జరిగిందన్నారు.

పాశ్చ్యాత్యుల కలలు కల్లలయ్యాయి :

భారత దేశ ఆహార భద్రతపై-మనుగడపై, భవిష్యత్‌పై పలు పాశ్చ్యాత్య రచయితలు చేసిన, వ్రాసిన ప్రచారాలు అర్దరహితమని తరువాత కాలంలో మన కర్షకులు, శాస్త్రవేత్తలు రుజువయ్యాయని ఎం.వి.రావు తెలిపారు. భారతీయ శాస్త్రజ్ఞుల విశేష కృషి, రైతుల అకుంఠిత దీక్షతో ప్రస్తుతం గోధుమలు, బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయని తెలిపారు.

''ఫ్యామిన్‌1975'' అనే పుస్తకంలో టాడర్‌ సోదరులు సమీప భవిష్యత్‌లో కరువుతో భారత్‌లో లక్షల మంది చనిపోతారని రాసుకున్నారని కాని 1975 నాటికి భారత్‌ ఆహార ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించిందని ఇందుకు మెరుగైన విత్తనాలే దోహదపడ్డాయని డా|| రావు వెల్లడించారు. మొదటి సస్యవిప్లవ కాలంలో భారత శాస్త్రజ్ఞుల కృషితోపాటు, ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉందని అధికోత్పత్తికి తోడ్పడే విత్తన సరఫరాతోపాటు, రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు క్రిమిసంహారక మందులువంటి సాధనాల కల్పనలో సఫలీకృతమైందని దానితోపాటు ''విజ్ఞాన పంపిణీ'' గ్రామస్ధాయి వరకు వెళ్ళడం మరొక ప్రధాన అంశమని తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి వ్యవసాయరంగం అభివృద్ధికి విశేషంగా ఇచ్చిన ప్రోత్సాహ సత్ఫలితాలను ఇచ్చింది. హరిత విప్లవానికి చిహ్నంగా గోధుమపై ఆనాటి ప్రభుత్వం ప్రత్యేకస్టాంపును విడుదల చేయడం గమనార్హం అన్నారు. ఉత్తరాంచల్లో పులులు తిరిగే తీరప్రాంతంలో పంత్‌నగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తనోత్పత్తికి చేసిన కృషి ఆ తరువాత స్టేట్‌ ఫార్మ్స్‌ కార్పోరేషన్‌, నేష్‌నల్‌ సీడ్స్‌ కార్పోరేషన్‌ వంటి సంస్థలను ఏర్పాటు చేసి కూకర్‌బారీలో 10వేల ఎకరాలు, సూరత్‌ఘర్‌లో 25వేల ఎకరాలు బరేలీలో 10వేల ఎకరాలు, పంత్‌నగర్‌లో 8వేల ఎకరాలను అభివృద్దిచేసి విత్తనోత్పత్తికి బాటలు వేసిందన్నారు. ప్రస్తుతం ఆ సంస్ధలన్నీ నిర్వీర్యమైపోయాయని విత్తనోత్పత్తిలో ఆనాటి కృషి ఇప్పుడు లేకపోవడం ఆందోళనకరంగా ఉందని డా|| రావు ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి ప్రభుత్వాలు విత్తనోత్పత్తికి శ్రద్ద వహించకుండా, బహుళజాతి సంస్థలకు విత్తనరంగాన్ని వదిలివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దప్రాతిపదికన తిరిగి విత్తనోత్పత్తికి దృష్టి పెట్టపోతే రైతుకు అన్యాయం చేసిన వాళ్ళమౌతామన్నారు. భారతీయ విత్తనోత్పత్తి కంపెనీలన్నీ, బహుళజాతి కంపెనీల కబంధ హస్తాల్లోకి వెళ్ళి పోతున్నాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే 500 విత్తన కంపెనీల్లో 10 మాత్రమే స్వతంత్య్రంగా మిగిలాయని తెలిపారు. తీనికి తోడు వంకాయతో సహా, భారతీయ సంప్రదాయ ఉత్పత్తులు'' జన్యు మార్పిడితో పరాధీనం కావడం శుభసూచికం కాదని అన్నారు. 1976లో తన ఆధ్వర్యంలో ఏర్పడిన విత్తన విధాన నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం జాతీయ విత్తన విధాన బిల్లును పార్లమెంట్‌లో కొన్ని మార్పులతో ప్రవేశపెట్టిందని ఇందులో రైతుల ప్రయోజనాలకు భంగం కలుగకుండా సభ్యులు జాగ్రత్త పడాలని డా|| రావు కోరారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర వ్వవసాయానికి ప్రాధాన్యతనిచ్చే చర్యలు చేపట్టాలని శరవేగంతో పెరుగుతున్న జనాభా కనుగుణంగా ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని డా|| రావు అభిలషించారు. దీనితోపాటు ప్రతి భారతీయునికి పోషకాహారాన్ని సమకూర్చడం ద్వారా జాతి బలవత్తర మవుతుందని ఆకాంక్షించారు. ఒకవైపు ఆహారఉత్పత్తిని పెంచుకుంటూ పోతూనే మరోవైపు పెనుముప్పుగా మారనున్న జనాభా పెరుగుదలను కూడా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జనాభా బాంబు విస్ఫోటనంలా ప్రేలకముందే ఆహారభద్రతకు తగు చర్యలు తీసుకోవడం తన కర్తవ్యంగా అటు ప్రభుత్వం, ఇటు శాస్త్రవేత్తలు అధికారులు భావించాలని కోరారు.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌