ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో జీడిమామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ జీడిమామిడి అనకార్డియేసి కుటుంబానికి చెందినది. దీన్ని డాలర్‌ ఎర్నింగ్‌ క్రాప్‌ అని కూడా పిలుస్తారు. జీడిమామిడి తోటలను వివిధ దేశాల్లో వాణిజ్య సరళిలో పెంచుతున్నారు. భారతదేశం జీడిమామిడి పరిశ్రమలో జీడిపిక్కల ఎగుమతిలో, గింజల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది.

జీడిపప్పుకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. కాని మనదేశంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. జీడిమామిడి తోటల్లో తక్కువ దిగుబడికి ముఖ్యకారణాలు.

జీడి మొక్కలను నిస్సారమైన భూముల్లో పెంచడం

తోటలను చాలా వరకు జన్యుసామర్ధ్యం లేని పిక్కలను భూమిలో నాటడం ద్వారా ఎత్తు తక్కువగా ఉంటుంది.

కొమ్మ కత్తిరింపులు చేపట్టకపోవడం

వీటితోపాటు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులు జీడిమామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ అంతర పంటల ద్వారా సుస్థిర ఆదాయాన్ని రైతులు పొందగలరు.

జీడిపప్పుకు ఉన్న డిమాండ్‌ మరియు మార్కెట్‌ కారణంగా ప్రతి సంవత్సరం జీడిపంట విస్తీర్ణం పెరుగుతుంది. తోట నాటిన తొలి సంవత్సరాల్లో మొక్కల మధ్య ఉన్న స్థలాన్ని అంతర పంటలు వేసుకోవడానికి వినియోగించుకున్నట్లయితే రైతు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.

నూతన జీడి తోటల్లో అంతర పంటల సాగు :

నేలల యొక్క స్వభావం మరియు నీటి వసతిని బట్టి అంతర పంటల యొక్క ఎన్నిక ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జీడిమామిడిని సారవంతం లేని ఇసుకతో కూడిన ఒండ్రు మట్టి ఉన్న నేలల్లో పెంచుతారు. ఇటువంటి నేలల్లో వేరు లేదా దుంప పంటలు బాగా అనుకూలం. నీటి యొక్క దుంప అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా అల్లం, పసుపు, కర్ర పెండలం వంటి పంటలు మంచి దిగుబడినిస్తాయి. వీటితోపాటు పెసలు, మినుములు, ఆకుకూరలు, పూల మొక్కలు మొదలైనవి అంతర పంటలుగా వేసుకోవచ్చు.

నీటి వసతితో కూడిన ఎర్ర, ఒండ్రు నేలల్లో కూరగాయ పంటలైన వంగ, మిరప మరియు అధిక ఆదాయాన్నిచ్చే పూల మొక్కలు బంతి, కనకాంబరం, లిల్లీ వంటివి జీడిమామిడిలో అంతర పంటలుగా వేయవచ్చు.

ముదురు తోటల్లో అంతర పంటల ఎన్నిక - సాగు పద్ధతులు :

పైనాపిల్‌ పంట ముదురు తోటల్లో అత్యంత అనుకూలమైన పంట. ముఖ్యంగా ఇసుక నేలలు, గరప నేలలు, గిరిజన కొండవాలు ప్రాంతాల్లో కూడా అంతర పంటగా వేసుకునేందుకు అత్యంత అనుకూలమైన పంట.

సూర్యరశ్మి నేలకు కొద్దిగా తగిలిన ముదురు తోటల్లో అల్లం, పసుపు వంటి పంటలను కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు.

జీడి పంట కోత సాధారణంగా మే నెలలో పూర్తవుతుంది. కాబట్టి జూన్‌లో కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రసరణ చెట్ల యొక్క అంతర భాగాలకు మరియు నేలకు తాకుతుంది. తొలకరి వర్షాలు మొదలవగానే అల్లం కొమ్ములను జీడిచెట్ల వరుసల మధ్య నాటుకోవాలి. పసుపు కొమ్ములను మే చివరి వారం నుండి జూన్‌ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. జూలై రెండవ పక్షం తరువాత నాటినట్లయితే దిగుబడి చాలా తగ్గుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ''రోమా'' రకం మంచి దిగుబడులను, నాణ్యతను కనబరుస్తుంది. పంట కాలం 8-9 నెలలు.

జీడిమామిడిలో దీర్ఘకాలపు అంతర పంటగా పైనాపిల్‌ను గిరిజన ప్రాంతాలు, రాళ్ళతో కూడిన ఇసుక నేలలు, వాలు ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు. చీడపీడలు ఆశించవు. నీటి యాజమాన్యం చేపట్టకపోయినా, మొక్కలు / పిలకలు నాటిన సంవత్సరంన్నర తరువాత నుండి దిగుబడులు ప్రతి సంవత్సరం పొందవచ్చు.

జీడిమామిడిలో అంతర పంటల సాగు నమూనా :

జీడిమామిడిలో అనేక రకాల అంతర పంటలను వేసుకోవచ్చు. పంట మార్పిడి, బహుళ పంటలు ఉపయోగించడం వంటివి చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల ద్వారా ప్రధాన జీడిపంట నుండి తక్కువ ఆదాయం వచ్చిన మిగిలిన పంటల ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చు. జీడితోటలో బహుళ పంటల నమూనాలు కింద ఇవ్వడం జరిగింది.

జీడిమామిడి + పసుపు + పైనాపిల్‌

జీడిమామిడి + అల్లం + పసుపు

జీడిమామిడి + కర్రపెండలం+ అపరాలు

జీడిమామిడి + కూరగాయలు (వంగ, మిరప) + పూల మొక్కలు

జీడిమామిడి + బంతి + వేరుశనగ

జీడిమామిడి + పశుగ్రాసం + పైనాపిల్‌

పైన ఉదహరించిన నమూనాలు, పంటలను వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి మార్చుకుండా జీడిమామిడి పంట నుండే కాక బహుళ అంతర పంటల నుండి అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

ఖరీఫ్‌ :

వంగ

అనువైన రకాలు : హరిత, మహికో రవయ్య, గ్రీన్‌లాండ్‌, అర్కనవనీత్‌

నాటే సమయం : జూలై, ఆగష్టు

ఇతర అంశాలు : 30-35 రోజుల వయస్సు గల నారు మొక్కలు నాటుకోవాలి.

పంట : మిరప

అనువైన రకాలు : ఎల్‌సిఎ-625, ఎల్‌సిఎ-616

నాటే సమయం : జులై, ఆగష్టు

ఇతర అంశాలు : ఆరు వారాల వయసు గల నారు నాటుకోవాలి.

బంతి

అనువైన రకాలు : ఎల్లో డాలర్‌ మాగ్జిమా ఎల్లో సెరంకోల్‌

నాటే సమయం : జూన్‌-సెప్టెంబరు

ఇతర అంశాలు : 25 రోజుల వయసు 3-4 ఆకులు గల నారు మొక్కలు నాటుకోవాలి

ఆకు కూరలు

నాటే సమయం : తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుండి

ఇతర అంశాలు : పాలకూర, గోంగూర, తోటకూర పంటలను మడులుగా పెంచుకోవాలి. లేని ఎడల కుళ్ళు ఆశించే అవకాశం ఉంది.

పశుగ్రాసం

నాటే సమయం : వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి

ఇతర అంశాలు : స్లిప్స్‌ నాటుకొని పెంచుకోవాలి.

కర్రపెండలం

అనువైన రకాలు : కొవ్వూరు, శ్రీకీర్తి, శ్రీ రూప

నాటే సమయం : జూన్‌-జులై

ఇతర అంశాలు : సుమారు 100-150 గ్రా. బరువు గల దుంపలను

అల్లం

అనువైన రకాలు : సుప్రబ, సాదియ రియోడిజనిరో

నాటే సమయం : మే నెలాఖరు వరకు విత్తుకోవాలి

ఇతర అంశాలు : 2-3 మొలకలు వచ్చి 40-50 గ్రా. బరువున్న దుంపలను విత్తనంగా వాడుకోవాలి.

పసుపు

అనువైన రకాలు : రోమా ప్రగతి

నాటే సమయం : మే నెలాఖరు నుండి జూన్‌ మొదటిపక్షం

ఇతర అంశాలు : మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్మలను నాటుకోవాలి

పైనాపిల్‌

అనువైన రకాలు : సింహాచలం క్యూ క్విన్‌ మారిషియస్‌

నాటే సమయం : జూలై-ఆగష్టు

ఇతర అంశాలు : రెండు వరుసల పద్ధతిలో పిలకలను వేసుకోవాలి

రబీ :

వంగ

అనువైన రకాలు : ఖరీఫ్‌ రకాలు రబీలో వేయవచ్చు

నాటే సమయం : నవంబరు-డిసెంబరు

మిరప

అనువైన రకాలు : ఎల్‌సిఎ-625, ఎల్‌సిఎ-616

నాటే సమయం : అక్టోబరు-నవంబరు

బంతి

అనువైన రకాలు : మాగ్జిమా ఎల్లో

నాటే సమయం : అక్టోబరు-నవంబరు

ఇతర అంశాలు : పించింగ్‌ చేయాలి

పెసర, మినుము

అనువైన రకాలు : ఎల్‌జిజి 450-410, పియు-31, టిబిజి-104

నాటే సమయం : అక్టోబరు

ఇతర అంశాలు : విత్తనం ద్వారా సాగు చేస్తారు. నేల సారవంతాన్ని పెంచుతాయి.

వేరుశనగ

అనువైన రకాలు : కదిరి 6-9, కదిరి అనంత

నాటే సమయం : నవంబరు-డిసెంబరు 15 వరకు

ఇతర అంశాలు : ట్రైకోడెర్మా విరిడి ఉన్న సేంద్రియ ఎరువులను వాడితే కాలక్‌ రాట్‌ (వేరుకుళ్ళు) రాకుండా ఉంటుంది.

డా|| వి. హరికుమార్‌, కృషి విజ్ఞాన కేంద్రం, విజయనగరం