ఖరీఫ్ 2019-20 త్వరలోనే మొదలవుతుంది. అందువల్ల రైతులు గత అనుభవాలను, ఆర్ధిక మరియు వ్యవసాయ వనరులను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరికి సరైన సన్నాహాలు చేసుకున్నట్లయితే పంటలో లాభాలను పొందడం జరుగుతుంది. ముందుగా పంటలు మరియు వాటి రకాలను ఎన్నుకోవడంలో రైతులు జాగ్రత్త చూపాలి. మనకున్న నేల రకం, నీటి సదుపాయం, మన పెట్టుబడి మరియు ఇతర కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటను ఎంపిక చేసుకోవాలి.
రైతులు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయమేమిటంటే వ్యవసాయ ప్రణాళికను వారికి అనుగుణంగా తయారుచేసుకోవాలి. ప్రతిసారీ వేరేవాళ్ళను అనుకరించరాదు. కొన్ని దీర్ఘకాలిక మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను స్పష్టించే విధంగా ఉండాలి.
ముందుగా నేల సారవంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి.
వీలైనంత వరకు చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవాలి.
పశువుల ఎరువు లేదా కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును తప్పకుండా మన వ్యవసాయంలో వాడాలి.
ఒకటి లేదా రెండు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్నచోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులను (జీలుగ, పెసర, జనుము) వేసి అవి పూత దశకు చేరుకునే ముందు రోటేవేటర్ సహాయంతో నేలను కలియదున్నాలి.
స్థూలపోషకాలు మాత్రమే కాకుండా సూక్ష్మపోషకాలను సంబంధించిన ఎరువులను కూడా నేలలో వేయాలి.
ఏక పంటకు బదులుగా బహుళ పంటల పద్ధతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు తక్కువ పెట్టుబడి అవసరమనుకున్న పంటలను ఎన్నుకోవాలి. అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేదా రకాల మార్పిడి చేయాలి.
పంటల్లో మన పరిస్థితులకు అనువైన రకాలను అలాగే మన ప్రాంతంలో ఆశించే చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి.
ఎండాకాలంలో మట్టి నమూనా పరిక్షలు చేయించాలి.
వాతావరణ సూచనలు, భూగర్భ జలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి అనుగుణమైన పంటలను సాగుచేయాలి.
తరచుగా కిసాన్ కాల్ సెంటర్ లేదా మండల వ్యవసాయాధికారిని లేదా ఏరువాక కేంద్రాలను సంప్రదించాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితుల సహాయాన్ని ముఖ్యంగా మార్కెటింగ్, గిడ్డంగుల మరియు పంటరుణాల వంటి వాటిని రైతులు వినియోగించుకోవాలి.
రైతులు ముఖ్యంగా విత్తనాలను అధీకృత డీలర్ల దగ్గరే కొనాలి. అలాగే రశీదు తీసుకొని భద్రపరచుకోవాలి.
సమగ్ర సుస్థిర వ్యవసాయంలో భాగంగా పందిరి కూరగాయలు, పెరటికోళ్ళు, పెంపకం, పాడిగేదెల పెంపకం మొదలగునవి చేపట్టాలి.
ఈ విధంగా రైతులు సరైన ప్రణాళికలను ఖరీఫ్‌కు ముందుగా రూపొందించుకొని పంటలపై పెట్టుబడిని తగ్గించుకొని పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకొని వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధరంగాలపై కూడా దృష్టిని సారించి వ్యవసాయాన్ని ఖరీఫ్‌లో పండుగలాగా చేసుకోవాలి.
వి. సాయి కిరణ్, పి. గోన్యానాయక్, వై. ప్రశాంత్