మన దేశం సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాల పంటలన్నిటిలో ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో మిరప పంట మొదటి స్థానంలో ఉంది. దేశంలో సుగంధ ద్రవ్యాల మొత్తం సాగు విస్తీర్ణంలో 25 శాతం మరియు ఉత్పత్తిలో 22 శాతం మిరప పంట సాగు చేయబడుతుంది. 2017-18 సంవత్సరంలో దేశంలో సుమారు 8.2 లక్షల హెక్టార్లలో మిరప పంట సాగు చేయడం జరిగినది. తద్వారా సుమారు 20.32 లక్షల టన్నుల మిరప పంటను పండించడం జరిగినది. మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.5లక్షల టన్నుల మిరప కాయలను 81 వేల హెక్టార్లలో ఉత్పత్తి చేయడం జరిగినది. వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో సింహభాగం మిరపకాయలు పండించడం జరుగుతున్నది.

మిరపలో లాభాలను పొందటానికి సాగు సమయంలో అవలంబించే యాజమాన్య పద్ధతులతో పాటు పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. మనం తీసుకునే జాగ్రత్తలతోనే మన పంటయొక్క నాణ్యత నిర్ధారించబడుతుంది. పంట కోత అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకోని ఎడల కాయ బరువు, నాణ్యత తగ్గి వాటిలో ఉన్న నాణ్యత ప్రమాణాలు అయినటువంటి రంగు, గాఢత మరియు అఫ్లోటాక్సిన్‌ శాతంలో తేడా వచ్చి మార్కెట్లో మిరప పంట యొక్క ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరల్లో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో కారప్పొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాల్లో మిరప పొడితో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్‌, నూనె మరియు రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు, మాంసాహార ఉత్పత్తుల్లో, బేకరీ, స్నాక్స్‌, చాక్లెట్‌, పానీయాల తయారీలో భాగంగా పరిశ్రమల ముడి సరుకుగా ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మిరప పంటను ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో గుంటూరు, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మిరప పంటను అధిక మొత్తంలో సాగు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు రైతులు పంట పండించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కోసిన తరువాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పంట యొక్క నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ముఖ్యంగా మిరపకాయల యొక్క రంగు మరియు గాఢత ప్రమాణాలను ఆధారముగా చేసుకొని మిరప పంటకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరను నిర్ణయిస్తారు. మంచి రంగు మరియు గాఢత మన పంటలో నిల్వ చేయడానికి, పంట కోసే సమయంలో మరియు పంట కోసిన తరువాత ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.

పూర్తిగా పక్వానికి వచ్చిన మిరపకాయలను మాత్రమే కోసి ఎండ పెట్టవలెను.

కోతకు కనీసం ఇరవై రోజుల ముందు ఎలాంటి పురుగు మందులు పిచికారి చేయరాదు.

మిరప పండ్లను కోసేటప్పుడు నాణ్యత ప్రకారం గ్రేడింగ్‌ చేయవలెను. మంచి రంగు కాయలు ఒక బుట్టలో తాలుకాయలు వేరొక బుట్టలో వేయాలి.

కోసిన మిరపకాయలను శుభ్రమైన బుట్టలో గాని సంచులలో గాని నింపి కల్లానికి తీసుకెళ్లాలి.

కళ్ళంలో పోసిన వెంటనే ఆర పెట్టకుండా కనీసం ఒకటి లేదా రెండు రోజులు నీడలో రాసిగా పోయాలి. తద్వారా కాయకు మంచి రంగు వస్తుంది. నాణ్యతా ప్రమాణాల లో రంగు అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ప్రామాణిక అంశం.

కళ్ళంలో ఆరబోసిన కాయలు తొక్క కుండా దారులను ఏర్పాటు చేసుకోవాలి.

కాయలను సిమెంట్‌ కళ్ళం, ఇసుక కళ్ళం లేదా టార్పాలిన్‌ సీట్లపై మాత్రమే ఆరబెట్టాలి.

మిరప కాయలను ఆరబెట్టే కల్లాలను గ్రామానికి దూరంగా ఉన్న పరిశుభ్రమైన ప్రాంతాల్లో తయారు చేసుకోవాలి.

కళ్లంలో పోసిన కాయలన్ని సమంగా ఆరటానికి రోజు మార్చి రోజు కాయలను తిరగ కలపాలి.

కల్లంలో ఆరబెట్టిన మిరప పండ్లను మూడు దఫాలుగా తప్పక గ్రేడింగ్‌ చేయవలెను.

50 శాతం తేమ శాతం ఉన్నప్పుడు

2.20 శాతం తేమ శాతం ఉన్నప్పుడు,

3.9-11 శాతం తేమ శాతం ఉన్నప్పుడు రైతులు బస్తాలను నింపవలెను.

ఎండిన కాయలను నుండి తాలు, దెబ్బతిన్న మరియు తక్కువ రంగు కలిగిన కాయలను వేరు చేసి విడివిడిగా సంచులలో నింపవలెను.

ఎండాకాలంలో మిరపకాయలను తొక్కే ముందు పరిశుభ్రమైన స్ప్రేయర్లతో మంచినీటిని మాత్రమే మిరపకాయలపై పిచికారి చేయాలి.

వర్షాలు కురిసే సమయంలో కోతలు కోయరాదు.

బస్తాల మీద ఎటువంటి రంగును వాడరాదు అఫ్లోటాక్సిన్‌ వ్యాప్తి చెందకుండా మిరపకాయలను పట్టాల మీద లేదా సిమెంట్‌ గచ్చు మీద మాత్రమే పెట్టవలెను.

రాత్రిల్లు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి.

మిరప లో తేమ శాతం 9-11 శాతం కన్నా ఎక్కువగా ఉండకుండా ఎండబెట్టాలి.

తేమ శాతం పెరగడం వల్ల అప్లోడ్‌ టాక్సిన్‌ వద్ధి చెందే అవకాశం ఉంది.

అవకాశం ఉన్న చోట రైతులు మిరపకాయలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు, నాణ్యత ప్రమాణాలు తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆహార పదార్ధాల్లో తేమ అధికంగా ఉండటం వల్ల శిలీంద్రాలు వద్ధి చెంది, వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదకరమైన టాక్సిన్లు ఉత్పత్తి చేసి ఆహారాన్ని విషతుల్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా మిరప పంటలో అఫ్లోటాక్సిన్‌ అనే విష పదార్థం మిరపలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వద్ధి చెంది మిరపకాయ మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రైతు సోదరులు కూడా మిరపకాయలు కోసి చూసినట్లయితే మనకు నల్లని బూజు వంటి శిలీంద్ర కనిపిస్తుంది. అదే ఈ అఫ్లోటాక్సిన్‌ ఉత్పత్తి చేసే శిలీంద్రం. ముఖ్యంగా అస్పెర్జిల్లాస్‌ ఫ్లావాస్‌, అస్పెర్జిల్లాస్‌ పారాలైటికాస్‌ అనే శిలీంద్రాలు అఫ్లోటాక్సిన్‌ను మిరపకాయల్లో విడుదల చేస్తున్నాయి. అఫ్లోటాక్సిన్‌ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి మార్కెట్లో గిరాకీ ఉండదు. కావున రైతు సోదరులు కోసిన తరువాత మిరపకాయలు ఎండపెట్టిన తరువాత తేమశాతం 9-11 శాతం లోపు ఉండే విధంగా చూసుకోవాలి.

మిరప పంట కోత తరువాత ఆశించే శిలీంద్రాలలో అస్పెర్జిల్లాస్‌ ఫ్లావాస్‌ అనే శిలీంద్రం అతి ముఖ్యమైనది. ఈ శిలీంద్రం అఫ్లోటాక్సిన్‌ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తుంది.

అఫ్లోటాక్సిన్‌ సోకడానికి గల కారణాలు :

కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకు గురైనప్పుడు వద్ధి చెందుతుంది.

మిరపకాయలు సాగునీటిలో తడిచినప్పుడు, సరైన సమయంలో మిరపకాయలు కోయనప్పుడు.

మిరపకాయలను అపరిశుభ్రమైన నేలపైన పెట్టినపప్పుడు, గ్రేడింగ్‌ చేయకపోవడం వల్ల తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయల నుండి మంచి కాయలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కోతకు వచ్చిన కాయలు కళ్ళాల్లో ఆరుతున్న సమయంలో కాయలు అకాల వర్షాలకు గురైనప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, మిరపకాయలు ఎండుటకు ఎక్కువ కాలం పడుతుంది కావున కాయల్లో తేమ శాతం తొందరగా తగ్గదు. ఈ పరిస్థితిలో బూజు హాని చేసే స్థాయి పెరిగి మీరు పంటకు ధర లేకుండా చేస్తుంది.

నిలువ చేసే సమయంలో మిరపకాయలు మరియు వాటి సంబంధిత ఉత్పత్తుల తేమశాతం 11 శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

అప్లోటాక్సిన్‌ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు :

కోతకు ముందు వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లయితే మిరప పంటకు నీటి తడులు ఇవ్వాలి. సాగునీరు మిరపకాయలకు తాకకూడదు. ఈ నీరు తాకితే ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాయలను నేల మీద ఆర పెట్టకూడదు. మిరపకాయలను టార్పాలిన్‌ పట్టాల పైన లేదా సిమెంట్‌ ఫ్లోర్‌ లేదా ఇసుక కళ్ళం మీద ఆరబెట్టాలి. రాత్రి సమయంలో మిరపకాయలు మంచు బారిన పడకుండా టార్పాలిన్‌ పట్టాలతో కప్పాలి. కాయ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర పోషిస్తుంది కావున కాయలు కోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది దీన్ని 10-11 శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి ఆరపెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలను నింపేముందు నీటిని చిలక రాదు. కాయలను గాలి సోకకుండా బస్తాల్లో ప్యాక్‌ చేయాలి. చల్లని చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.

ఎగుమతికి అనుకూలమైన మిరప రకాలు :

అధిక మిరప గుజ్జు నిచ్చే రకాలు - పుష్ప జాల, బ్యాడిగా, బ్యాడిగాడబ్బి, కూజూ -235, 334, 324, సింధూర్‌,

అధిక రంగునిచ్చే రకాలు - కూజూ-206, 304, 305, 357, 424, సింధూర్‌.

అధిక గాటు కలిగిన రకాలు - కూజూ -235, 334, 324 పుష్ప జ్వాల, అపర్ణ, ూఖవీ-1

ప్రాంతం లేదా దేశం మిరపకాయలు లేదా మిరప పొడి ప్రామాణికం గరిష్ట ప్రామాణ పరిమితి
ఐరోపా ప్రాంతం ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb
అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb
అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
అమెరికా ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 20 ppb
సాల్మొనెల్లా 25 గ్రా.లలో శూన్యం
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 20 ppb
కెనడా ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 15 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 15 ppb
దక్షిణ ఆఫ్రికా ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb
అఫ్లోటాక్సిన్‌ మొత్తం 15 ppb
ఉత్తర అమెరికా కెనడా కాకుండా ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 30 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 30 ppb
జపాన్‌ ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
ఆస్ట్రేలియా & న్యూజిలాండ్‌ ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 15 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 15 ppb
మలేషియా ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb
అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ B1-5 ppb
అఫ్లోటాక్సిన్‌ మొత్తం 10 ppb
ఇతర దేశాలు ఎండు మిరపకాయలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 30 ppb
మిరప పొడి & ఇతర మిరప పదార్థాలు అఫ్లోటాక్సిన్‌ అఫ్లోటాక్సిన్‌ మొత్తం 30 ppb

కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ ప్రకారం మిరపకాయలు మరియు మిరప పొడిలో ఈ కింద ప్రమాణాలు ఉండాలి.

లక్షణాలు ఎండు మిరపకాయలు మిరప పొడి
వ్యర్ధ పదార్థాల శాతం 1.0 % -
బాగా పండ నటువంటి & మచ్చలతో కూడిన మిరపకాయల శాతం 2.0 % -
విరిగిపోయిన మిరపకాయలు,విత్తనాలు & ముక్కలు 5.0 % -
తేమ శాతం 11.0% 11.0%
బూడిద శాతం 8.0 % 8.0 %
ఆమ్లంలో కరగని బూడిద శాతం 1.3 % 1.3 %
కీటకాల ఆశించి నష్ట పడ్డ భాగం 1.0 % -
పీచు పదార్థం - 30%
మిరప నుండి తీసిన నూనె - 12%పైగా

మిరపకాయ యొక్క ఘాటు లక్షణము దానిలో ఉన్న రసాయనం అయిన క్యాప్సైసిన్‌ వల్ల వస్తుంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ధరలను మిరపకాయ యొక్క ఘాటు తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఘాటుతో పాటు మంచి రంగు కు మంచి ధరలు ఉంటాయి. మన దేశంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా ఎక్కువ ఘాటు కలిగిన రకాలను వాడుతారు. ఉత్తర భారతంలో తక్కువ ఘాటు కలిగి మంచి కలరు ఉన్న మిరపకాయలను కూరల్లో వాడుతారు. ఘాటు తీవ్రతకు కారణమైన మిరపకాయలో ఉన్న క్యాప్సైసిన్‌ ఆధారంగా మిరపకాయ రకాలను వర్గీకరించడమైనది.

పరిధి (%) విభాగం రకాలు

1.00 ఎక్కువ సీమ మిరప, తెల్ల సీమ మిరప, నైజీరియన్‌ మిరప

0.76-1.00 మధ్యస్థం నుండి ఎక్కువ కె2, జవహర్‌

0.51-0.75 మధ్యస్థం జి4, జ్వాలా, ముసత్వాడి

0.26-0.50 తక్కువ నుండి మధ్యస్తం ఎల్‌ సి ఏ-235, జి4, జి5, ఎల్‌ సి ఏ-334, ఎల్‌ సి ఏ-353

0.10-0.25 తక్కువ సిందూర్‌, ఎల్‌ సి ఏ-206, ఎల్‌ సి ఏ-424, ఎల్‌ సి ఏ-436

ఎండుమిరపకాయల్లో 5 పిపిబి అంటే సుమారు ఒక కిలో ఎండు మిరప కాయల్లో 5 మైక్రో గ్రాముల మిరప పొడి మరియు ఎండుమిరపకాయల తయారు చేసిన ఆహార పదార్థాల్లో సుమారు 10 పిపిబి అనగా సుమారు ఒక కిలో మిరప పొడి లేదా మిరప కాయలతో చేసిన పదార్థాల్లో 10 మైక్రో గ్రాముల కంటే ఎక్కువ ఉండరాదు.

యం. సునీల్‌ కుమార్‌, ఎ. పోశాద్రి, యం. రఘువీర్‌, జి. శివచరణ్‌, ఎ. రమాదేవి,

వై. ప్రవీణ్‌ కుమార్‌ మరియు డా. ఆర్‌. ఉమారెడ్డి, కషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌.