మామిడి పండు పండ్లలో రారాజు. ఇది ఉష్ణమండలపంట. మామిడి పండ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రధమస్థానంలో ఉంది. సాధారణంగా పంటకోసిన తరువాత నిల్వ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. శీతలగిడ్డంగుల్లో వాటిని రెండు, మూడు వారాల వరకు పాడవకుండా నిల్వ చేయవచ్చు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ జరిపిన సర్వేలో మనదేశంలో ఉత్పత్తయ్యే పండ్లలో 30 శాతం వరకు కోత తరువాత పాడవుతుంది. ఇంత ఎక్కువగా పండ్లు పాడవడానికి చాలా కారణాలున్నాయి.

1. శాస్త్రోక్తంగా కాయకోత కోయకుండా ఉండడం

2. చెట్టులోని అన్ని కాయలకు ఒకేసారి కోయడం (పండిన, ముదిరిన, లేతకాయలు)

3. గ్రేడింగ్‌ సరిగ్గా చేయకపోవడం.

4. సరైన పద్ధతిలో ప్యాకింగ్‌ చేయకపోవడం

5. రవాణాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం

6. నిల్వలో లోపాలు.

7. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో నిల్వచేయడం

8. సరైన దశలో కాయలు కోయకపోవడం

9. సరైన పనిముట్లను వాడకపోవడం

10. కాయల్లో సొనతీసివేయకపోవడం

మామిడిలో నష్టాన్ని తగ్గించి కాయల్ని ఎక్కువకాలం నాణ్యతతో నిల్వ చేసేందుకు కోత ముందు, కోత తరువాత మెళకువులను పాటించాల్సి ఉంటుంది.

కాయ పరిపక్వత :

నాణ్యమైన పండ్లు కావాలంటే కాయలను పూర్తిగా ముదిరిన తరువాతనే కోయాలి. ముదరని కాయలు సరిగ్గా పక్వానికి రావు. ఒకవేళ పండినా నాణ్యంగా ఉండవు. తినడానికి అనువుగా ఉండవు. బాగా ముదిరిన కాయలు త్వరగా పండి తినడానికి పనికిరావు. మామిడికాయలు కోసేటప్పుడు కింది లక్షణాలను గమనించాలి.

1. కాయ భుజాలు బాగా ఏర్పడి, తొడిమ వద్ద గుంట ఉండాలి.

2. కాయతోలు గాఢ (ముదురు) ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగు ఉండాలి.

3. స్వేదగ్రంధులు బాగా కనిపించాలి.

4. నీటిలో వేసినప్పుడు కాయలు నీటిలో మునగాలి.

5. కాయలోని కండ ఆకుపచ్చ తెలుపునుండి లేత పసుపురంగుకు మారాలి.

కాయలు కోసే పద్ధతి :

కాయల్ని చేతికి అందే ఎత్తులో ఉంటే చేతితో కోయవచ్చు. లేదంటే మహారాష్ట్రలోని డాపోలి కృషి విద్యాపీఠం వారు రూపొందించిన డాపోలి చిక్కం, ఐ.ఎ.ఆర్‌.ఐ న్యూఢిల్లీ వారు రూపొందించిన పూసా చిక్కం ద్వారా మామిడి కాయలను కోయవచ్చు. మామిడి కాయలను కొంత తొడిమతో సహాకోయాలి. కాయలు కోసిన తరువాత ప్లాస్టిక్‌ కేట్స్‌లో నింపి చల్లని ప్రాంతాలకు తరలించాలి. ఎండలో ఎక్కువ సమయం ఉంచరాదు. గ్రేడింగ్‌ చేయాలి. ముదరని కాయలు, పండిన కాయలు, పగిలినకాయలు తీసివేయాలి. కాయలను గ్రేడింగ్‌ తరువాత ప్లాస్టిక్‌ క్రేట్స్‌లో నింపేముందు క్రేట్స్‌ అడుగుభాగాన పేపర్‌కటింగ్‌ లేదా గడ్డిని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాయలను గోనె సంచుల్లో నింపరాదు. ఈ విధంగా వేయడం వల్ల కాయలు ఒకదానికొకటి రాసుకొని పాడవుతాయి.

కాయల్లో సొనతీయుట :

కాయలపై సొనపడిన భాగం కమిలి నల్లగా మారుతుంది. ఇలాంటి నల్లబడిన కాయలకు మార్కెట్‌లో ధర రాదు మరియు కాయలు త్వరగా పాడవుతాయి. కనుక దీన్ని నివారించడానికి కాయలను తెంపిన తరువాత కాయలకున్న కాడను ఒక అర సెంటీ మీటరు వరకు ఉంచి మిగిలిన కాడను కత్తిరించి ప్రత్యేకమైన వెదుర్లతో తయారు చేసిన మంచెలపై సొనపూర్తిగా కారిపోయేటట్లు తలక్రిందులుగా 2-3 గంటలు ఉంచాలి. తొడిమ నుండి సొన పూర్తిగా కారిన తరువాత కాయల్ని లీటరు నీటికి 1 గ్రా., సబ్బు పొడిని కలిపిన ద్రావణంలో ముంచిన తెల్లటి మెత్తని గుడ్డతో రుద్ది తరువాత లీటరు నీటికి అర గ్రాము బెన్‌లిట్‌ లేదా పోక్లోరాజ్‌ కలిపిన ద్రావణంలో 3 ని|| ఉంచాలి. ఆ తరువాత కాయలకున్న తేమను పొడి గుడ్డతో తుడిచివేయాలి.

గ్రేడింగ్‌ :

ప్యాకింగ్‌కు ముందు గ్రేడింగ్‌ చేయాలి. ప్యాక్‌ చేయుటకు ముందు కాయలపై మచ్చ, మసి, మంగు, తామరపువ్వు ద్వారా మరలు ఏర్పడి ఉన్న వాటిని వేరు చేయాలి. కాయలను సైజుల ఆధారంగా లేదా బరువు ఆధారంగా గ్రేడ్‌ చేసి ప్యాక్‌ చేయాలి. పూర్తిగా ముదిరిన కాయలు తొందరగాను, కమర్షియల్‌గా ముదిరిన కాయలను ఆలస్యంగా పండుతాయి.

ప్యాక్‌హౌస్‌కు కాయల రవాణా :

గ్రేడింగ్‌ చేసిన కాయలను ప్లాస్టిక్‌ క్రేట్స్‌లలో నింపి జాగ్రత్తగా శుభ్రమైన వాహనాల్లో ఎండతగల కుండా ప్యాక్‌హౌస్‌కు రవాణా చేయాలి. ప్యాక్‌హౌస్‌ చాలాదూరంగా ఉంటే తప్పనిసరిగా శీతల వాహనాల్లో పంపాలి. కాయలున్న క్రేేట్స్‌ని లోడ్‌ చేసేటప్పుడు, రవాణాలోనూ ఎలాంటి దెబ్బలు తగలకుండా, ఒత్తిడికి గురికాకుండా చూడాలి.

విదేశాలకు మామిడి ఎగుమతికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

విదేశాలకు మామిడిపండ్లను ఎగుమతి చేయాలంటే పూత దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలి.

1. చీడపీడలు, తెగుళ్ళ నివారణకు నిషేదించిన మందులు వాడరాదు.

2. చానా వరకు వృక్ష సంబంధమైన మందులను వాడాలి.

3. కోతకు ఒక నెల ముందు నుండి పురుగు మందులు స్ప్రే చేయరాదు.

4. బాగా తయారైన కాయలు మాత్రమే కోయాలి.

5. చెట్టుపై ఉన్న కాయలకు రక్షణ కొరకు 2 శాతం సున్నపునీరు కాయలపై పిచికారి చేసి, కోసిన తరువాత చల్లటి నీటితో కడగాలి.

6. అంతర్జాతీయ మార్కెట్‌లో పురుగు మందు అవశేషాలను ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా యం.ఆర్‌.ఎల్‌ (మాగ్జిమం రెసిడ్యుయల్‌ లిమిటెడ్‌) నిర్ణయించిన పరిమితిలో కంటే తక్కువ స్థాయిలో ఉండాలి.

ఎ. నిర్మల, డా|| యమ్‌. వెంకటేశ్వర రెడ్డి, డా|| నీరజ ప్రభాకర్‌, డా|| ఎ. మనోహర్‌ రావు, ఉద్యాన విభాగం,

కె. అరుణ, వ్యవసాయ విస్తరణ విభాగం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8247417586