ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా పండించే ఆహార ధాన్యం పంట వరి. వరి పంటను యాసంగి కాలంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వరి పైరును అనేక రకాల తెగుళ్ళు ఆశించి దిగుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. యాసంగిలో వరి పంటకు ఎక్కువగా నష్టం కలిగించేది అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు.

కాండం కుళ్ళు తెగులు :

ఈ తెగులు లక్షణాలు మూడు దశలుగా కనబడతాయి.

మొదటి దశ :

మొదటి దశలో అగ్గి తెగులు లక్షణాలు ఆకులపై కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకుపైన గోధుమ రంగులో చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపి పెద్దవై నూలు కండె ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఈ మచ్చల మధ్య భాగం బూడిద లేదా గడ్డ రంగులో ఉండి అంచులు నలుపు లేదా ముదురు గోధుమ రంగును కలిగి ఉంటాయి.

రెండో దశ :

రెండో దశలో ఈ తెగులు లక్షణాలు కణుపుల మీద ఏర్పడతాయి. ఈ లక్షణాలు వల్ల కణుపుల్లో కణజాలం కుళ్ళిపోయి నల్లగా మారుతుంది.

మూడో దశ :

మూడో దశలో ఈ అగ్గి తెగులు లక్షణాలు వెన్నులకు వ్యాపిస్తాయి. వరి మొక్క పైకి వచ్చేదశలో ఈ అగ్గి తెగులు సోకినట్లయితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి పడిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ తెగులును మెడ విరుపు అని అంటారు. మెడ విరుపు లక్షణాలు తీవ్రతరమైతే దిగుబడి దాదాపు 50-60 శాతం నష్టపోవాల్సి వస్తుంది. ఈ లక్షణాలు కలిగిన వెన్నులు మొదటిభాగం కణజాలంలోనే పదార్ధం కుళ్ళిపోయి, ఎండిపోతుంది. ఈ ప్రదేశంలో వెన్నులు విరిగిపోయి కిందకు వేలాడతాయి.

అనుకూల పరిస్థితులు :

యాసంగి కాలంలో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వారం రోజుల కంటే ఎక్కువ రోజులు తక్కువ రాత్రి ఉష్ణోగ్రత (18-220 సెం.) పగటి పూట ఎక్కువ ఉష్ణోగ్రత (28-300 సెం.) గాలిలో తేమ 90 శాతం మంచుతో కూడిన వాతావరణం, చిరుజల్లులు, నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఈ తెగులు ఉధృతికి అనుకూలం. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడడం పొలంలో, పొలంగట్ల మీద కలుపు నివారించుకోవడం కూడా ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. రైతులు నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు 3-4 దఫాలుగా వాడాలి.

యాజమాన్య పద్ధతులు :

విత్తనపు ఎంపిక నుండే రైతులు ఈ తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. తెగులును తట్టుకునే రకాలను ప్రాంతాల వారీగా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండిజమ్‌ కలిపి పొడి విత్తన శుద్ధి లేదా 1 గ్రా. కార్బండిజమ్‌ లీటరు నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నత్రజని ఎరువులను మోతాదు మేరకు 3-4 దఫాలుగా వేసుకోవాలి. పొలం గట్ల మీద పొలంలో గడ్డి జాతి మొక్కలను పూర్తిగా నిర్మూలించుకోవాలి. తెగులు లక్షణాలు గమనించగానే నివారణ చర్యలు చేపట్టాలి.

నివారణకు ట్రైసైక్లోజోల్‌ 15 శాతం 0.6 గ్రా. లేదా కానుగమైసిన్‌ 3 ఎల్‌ 2.5 మి.లీ. / లీటరు లేదా ఐసోప్రోధియోలిన్‌ 40 శాతం 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే 7-10 రోజుల తరువాత మరలా పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు :

ఈ తెగులును కలుగచేసే స్కరోషియమ్‌ ఒరైజ్‌ అనే శిలీంధ్రం పైరు పూర్తిగా పలకలు తొడిగిన దశ నుండి పాలు పోసుకునే దశ వరకు ఎప్పుడైనా ఆశించవచ్చు. దుబ్బు కట్టే దశలో ఆశించడం వల్ల దుబ్బులోని ఒక కర్ర లేదా పిలకలోని కింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పూత దశలో తెగులు ఆశించనట్లయితే వెన్నులు పాక్షికంగా రావడం లేదా వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ పొలంలో పైరు పక్వానికి రాకముందే ఎండిపోవడం జరుగుతుంది.

మొదళ్ళ వద్ద నున్న కణుపు లోపలి భాగం కుళ్ళిపోవడం వల్ల కాండం బలహీనపడి పైరు వాలిపోతుంది. ఈ దశలో వాడిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగంలో సన్నని ఆవగింజ రూపంలోని సిద్ద జీతాలు (స్కిరోషియా) కనిపిస్తాయి.

తెగులు వ్యాప్తి :

ఈ శిలీంధ్రం సాగు నీటి ద్వారా లేదా విత్తనం ద్వారా లేదా సుడిదోమ, కాండం తొలుచుపురుగులు ఏర్పరచిన గాయాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అనుకూల పరిస్థితులు :

వరి తరువాత వరి సాగు చేయడం, అధిక మోతాదులో నత్రజని వాడడం తేమతో కూడిన పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు అనుకూలం.

యాజమాన్యం :

వేసవికాలంలో లోతు దుక్కులు చేసినట్లయితే ఈ తెగులుకు సంబంధించిన సిద్ధబీజాలు సూర్యరశ్మి తాకిడికి లోనై పూర్తిగా నశించిపోతాయి.

పచ్చిరొట్ట పైరులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర లాంటి వాటిని పెంచి 30-45 రోజుల్లో వరి పొలంలో కలియదున్నినట్లయితే సిద్ధబీజాలు పూర్తిగా చనిపోతాయి.

పైపాటుగా పొటాష్‌ ఎరువును 15-20 కిలోలు / ఎకరానికి వేసినట్లయితే మొక్కలు దుబ్బు కట్టే దశ నుండి దృఢంగా ఉండి తెగులు తాకిడిని కొంత వరకు తట్టుకుంటాయి.

పొలంలోని నీటిమట్టాన్ని తగ్గించి కార్బండిజమ్‌ 10 గ్రా., లేదా హెక్సాకొనజోల్‌ 2.0 మి.లీ. లేదా వాలిడామైసిన్‌ 2.0 మి.లీ. లేదా ప్రొఫికొనజోల్‌ 1.0 మి.లీ. లేదా ట్రిబ్యుకొనజోల్‌ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పైరు మొదలు భాగం బాగా తడిచేలా 10-15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.

పైన చెప్పిన విధంగా రకాల ఎంపిక. విత్తన శుద్ధి, సేంద్రియ ఎరువుల వాడకం సరైన సమయంలో తెగులును గుర్తించి శిలీంద్రనాశినులు మందులను వాడినట్లయితే రైతులు అధిక దిగుబడులను యాసంగిలో పొందవచ్చు.

డా|| అరిశెనపల్లి విజయభాస్కర్‌ రావు, సీనియర్‌ తెగుళ్ళ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, ఆర్‌.ఎ.ఆర్‌.ఎస్‌, పి.జె.టి.ఎస్‌.ఎ.యు, వరంగల్‌, ఫోన్‌ : 98498 17896