చాలా ప్రమాదకరమైన పదార్థం శరీరంలోకి ప్రవేశించడాన్ని ''విషం ఎక్కడం'' అంటారు. మన పరిసరాల్లో ఉండే కొన్ని రకాల మొక్కలు విషపూరితమైనవి. పచ్చిమేతతో పాటే పశువులు ఇటువంటి మొక్కలను ఆహారంగా తీసుకోవడం వల్ల విష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. అటువంటి మొక్కలను గుర్తించడం మరియు ప్రమాదవసాత్తు పశువులు వాటిని గ్రహించిన ఎడల కలిగే దుష్ప్రభావ లక్షణాల గురించి పాడిరైతులు అవగాహన పెంపొందించు కోవటం వల్ల పశువులు వాటి విష ప్రభావానికి గురికాకుండా నివారించవచ్చు.

సాధారణంగా ఒక ప్రాంతంలోని వివిధ రకాల పశువులు ఒకే రకమైన లక్షణాలును ప్రదర్శిస్తూ అస్వస్థతకు లోనైనట్లైతే, అవి విషపు మొక్కల ప్రభావానికి గురైయ్యాయి అని అనుమానించవచ్చు. సహజంగా ఒక్కో రకం పశువు ఒక్కో రకం విషానికి, వేర్వేరు మోతాదుల్లో వివిధ రకాలుగా జబ్బు పడుతుంది.

మన గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా పెరిగే కొన్ని రకాల విషపు మొక్కలు మరియు వాటిని తినడం వల్ల పశువుల్లో కలిగే దుష్ప్రభావ లక్షణాలు.

గన్నేరు :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

కొమ్మలు/కాండం/ ఆకులు

విష రసాయనం :

కార్డియాక్‌ గ్లైకోసైడ్స్‌

అస్వస్థత లక్షణాలు :

పెద్ద పొట్ట కదలికలు మందగించటం, మల బద్ధకం, గుండె అతి వేగంగా కొట్టుకోవటం, శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవటం, కాళ్ళు కొట్టుకోవటం.

తూటికాడ (ఐపోమియా) :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

ఆకులు

విష రసాయనం :

లైసర్జిక్‌ ఆమ్లం

అస్వస్థత లక్షణాలు :

విపరీతంగా నోటి నుంచి నురగ రావటం, పారుడు, సమన్వయ లోపం.

పిచ్చి డొంక/పులి కంప/అడవి బంతి/సీమ గోరింట (లాంటానా) :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

ఆకులు

విష రసాయనం :

ట్రైటర్పినాయిడ్స్‌, లాంటడిన్‌-ఎ

అస్వస్థత లక్షణాలు :

చర్మం ఎర్ర బడటం, సూర్యరశ్మి పడకపోవటం, కను బొమ్మలు, చెవులు వాచి తీవ్రమైన నొప్పి, ముట్టె మరియు చెవుల కొనల వద్ద చీలికలు, జీర్ణ కోశ సమస్యలు, కాలేయం దెబ్బతినటం వలన కామెర్లు, రక్తస్రావం.

గురివింద (ఆబ్రస్‌ ప్రికటోరియస్‌) :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

విత్తనాలు

విష రసాయనం :

ఆబ్రిన్‌ (ఇది రక్త పింజర పాము విషంతో సమానం)

అస్వస్థత లక్షణాలు :

విపరీతంగా నోటి నుండి నురగ మరియు నాసికా రంధ్రాల నుండి స్రావాలు కారటం, రక్త విరేచనాలు, నోటిలో అల్సర్లు, శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోవటం, శోషరస గ్రంథుల వాపు.

లేత జొన్న, నీలగిరి (యూకలిప్టస్‌), అకేసియా :

విషపూరిత మొక్క భాగం/భాగాలు :

మొక్కల చిగుళ్ళు మరియు లేత ఆకులు

విష రసాయనం :

హైడ్రోసైనిక్‌ ఆమ్లం

అస్వస్థత లక్షణాలు :

కడుపును కాళ్ళతో తన్నుకోవటం, పారుడు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, పక్షవాతం, మూర్ఛ అపస్మారక స్థితిలోకి పోయి మరణిస్తాయి.

ఉమ్మెత్త :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

ఆకులు

విష రసాయనం :

అట్రోపిన్‌ ఆల్కలాయిడ్స్‌, కార్డియాక్‌ గ్లైకోసైడ్స్‌

అస్వస్థత లక్షణాలు :

పెద్ద పొట్టలో కదలికలు మందగించటం, దష్టి దోషం, గుండె అతివేగంగా కొట్టుకోవడం, శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవుట, పక్షవాతం, శ్వాస తీసుకోవటంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడి చివరకు మరణం సంభవిస్తుంది.

ఆముదం :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

నూనె తీసిన ఆముదం గింజల పిప్పి

విష రసాయనం :

లెక్టిన్‌, హీమోగ్లుటినిన్స్‌

అస్వస్థత లక్షణాలు :

పశువుల్లోని రోగ నిరోధక శక్తిని క్షీణింప జేస్తాయి. దూడల్లో పెరుగుదల తగ్గిపోవటం, తిన్న మేత అరుగుదల తగ్గడం, కడుపును కాళ్ళతో తన్నుకోవటం, పారుడు రోగం.

ఆక్సాలిస్‌ (పులిచింత), బ్రాస్సికా, బీటా వల్గారిస్‌ :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

ఆకులు, దుంపలు

విష రసాయనం :

ఆక్సాలిక్‌ ఆమ్లం

అస్వస్థత లక్షణాలు :

అతిముఖ్యమైన కాల్షియం ధాతువును పశువులకు లభించకుండా అడ్డు కోవటం, విపరీతంగా నోటి నుంచి నురగ కారటం, మూత్రపిండాలు పనితీరు మందగించటం వల్ల చివరకు అపస్మారక స్థితిని పొందుతాయి.

వయ్యారిభామ & బ్రాకెన్‌ ఫెర్న్‌ :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

మొక్క అన్ని భాగాలు

విష రసాయనం :

థయమినేజ్‌

అస్వస్థత లక్షణాలు : తీవ్ర రక్త స్రావం, విటమిన్‌ బి1 పోషక లోపం కలగటం, గొంతు ప్రాంతంలో వాపు, చర్మ సంబంధమైన రోగాలు, శ్వాస తీసుకోవటం కష్టం అవటం, కళ్ళు మరియు నాసికా రంధ్రాల నుండి స్రావాలు కారటం, అధిక ఉష్ణోగ్రత, సమన్వయలోపం, కొన్నిసార్లు మూత్రం మరియు పేడలో రక్తం కనిపించటం, పాలు రుచికి చేదుగా ఉండటం.

ఉల్లి & వెల్లుల్లి మొక్కలు :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

మొక్క అన్ని భాగాలు

విష రసాయనం :

డి-ప్రొపైల్‌ డై స ల్ఫైడ్స్‌

అస్వస్థత లక్షణాలు :

ఎరుపు రంగుతో కూడిన మూత్రం, రక్త నాళాల లోని ఎర్ర రక్త కణాలు విచ్చిన్నం అవటం వల్ల రక్త హీనత కలగటం, చర్మం నీలి వర్ణములోనికి మారటం.

ఆవాల మొక్కలు :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

మొక్క అన్ని భాగాలు

విష రసాయనం :

గ్లూకోసినోలేట్స్‌

అస్వస్థత లక్షణాలు :

అకస్మాత్తుగా జీర్ణ కోశ సంబంధమైన ఇబ్బందులు కలగటం, కడుపులో నొప్పి, నోటి మరియు ముక్కు నుండి నురగ రావటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు కలుగును.

జిల్లేడు :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

మొక్క అన్ని భాగాలు

విష రసాయనం :

కాలోట్రాక్షిన్‌, కేలాక్టిన్‌

అస్వస్థత లక్షణాలు :

చర్మం మరియు శ్లేష్మ త్వచములలో దురద కలగటం, ఉదర కోశ వ్యాధి, గుండె సంభందమైన వ్యాధులు.

ప్రత్తి :

విష పూరిత మొక్క భాగం/భాగాలు :

నూనె తీసిన తరువాత ప్రత్తి గింజల నుండి వచ్చే పిప్పి

విష రసాయనం :

గాస్సిపాల్‌

అస్వస్థత లక్షణాలు :

ముఖ్యంగా పందులు మరియు గుర్రాల్లో - ఊపిరితిత్తులలో నీరు చేరటం, చివరగా గుండె ఆగిపోవటం వల్ల మరణం సంభవించవచ్చు. ఆవుల్లో ఎర్ర రక్త కణాలు విచ్చిన్నం అవటం వల్ల రక్త హీనత కలుగును, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ముందరికాళ్ళ మధ్య భాగాల్లో నీరు చేరటం.

విష ప్రభావానికి గురైన పశువులకు చేయవలసిన ప్రథమ చికిత్స విధానం:

పశువు విష పూరిత మొక్కలను తినటాన్ని గమనించిన లేక అనుమానం కలిగిన, వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి పరిస్థితిని వివరించినట్లైతే విషప్రభావ తీవ్రతను తగ్గించి పశువును కాపాడుకోవచ్చు. అన్ని రకాలైన విష కారకాలకు విరుగుడు మందులు లభించక పోయినా విష ప్రభావానికి గురైన పశువు చూపించే లక్షణాల ఆధారంగా చికిత్స చేసి పశువులను సంరక్షించుకోవచ్చు. ఈ చికిత్స చేయడం అనేది త్వరితగతిన ప్రారంభించాలి. చికిత్సలో జాప్యం జరిగితే విష ప్రభావం మరింత ఎక్కువై, పశువు మరణించే ప్రమాదం ఉంది.

పశువు తిన్న విషపదార్థం రక్తంలోకి ప్రవేశించకుండా మరియు శరీరం నుండి త్వరితగతిన బయటకు పంపించడానికి తీసుకోవలసిన చర్యలు. 1. ఒక లీటరు పారఫిన్‌ (మైనం) లేదా వంట నూనెను త్రాగించటం లేదా ప్రత్యక్షంగా పెద్ద పొట్టలోకి ఎక్కించటం. 2. వంట బొగ్గును మెత్తగా పొడి చేసి పాలలో లేదా నీటిలో కలిపి (50 గ్రా./లీ.), పెద్ద పశువులకయితే 2 లీటర్లు, చిన్నవాటికి అయితే ఒక లీటరు చెప్పున తాగించాలి. 3. 10-12 గుడ్ల తెల్ల సొనను, పావు కేజీ పంచదారను లీటరు నీటిలో కలిపి రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు త్రాగించాలి.

1. ఫోటో సెన్సిటైజేషన్‌ (ఒక రకమైన చర్మ వ్యాధి) ప్రభావానికి లోనైన పశువులకు సులువుగా జీర్ణమయ్యే ఆహారం, పరిశుభ్రమైన నీటిని అందిస్తూ, చల్లని నీడ మరియు స్వచ్ఛమైన గాలి ప్రసరించే ప్రదేశాల్లో ఉంచి ఈగలు, దోమలు వాలకుండా వేప నూనె పూయాలి. మరియు ఇంజక్షన్‌ కార్తికోస్టేరాయిడ్‌ లను ఇవ్వాలి.

2. విష ప్రభావానికి లోనైన పశువు మూర్చవ్యాధికి గురై నేలమీద పడి తీవ్రంగా కొట్టుకుంటున్నప్పుడు వాటి పరిసర ప్రాంతాల్లో పదునైన వస్తువులు, రాళ్ళు లేకుండా చూసుకోవాలి మరియు ఇంజక్షన్‌ డైజీపాం ఇవ్వాలి.

3. లేత జొన్న ఆకులను మేసిన పశువులు సైనైడ్‌ ప్రభావానికి గురైనప్పుడు దీనికి విరుగుడుగా సోడియం నైట్రేట్‌, సోడియం థయాసల్ఫేట్‌ ద్రావణాలను వాడాలి మరియు పౌడర్‌ చార్కోల్‌ను త్రాగించాలి.

4. ఆకలి మందగించి తీవ్రంగా నీరసించిన పశువులకు గ్లూకోస్‌ ద్రావణాన్ని మరియు కాల్షియం ఇంజక్షన్‌ను రక్తంలోకి ఎక్కించాలి మరియు విటమిన్‌ల టానిక్‌లను వాడాలి.

5. పశువు తొందరగా కోలుకొనేందుకు వీలుగా బి కాంప్లెక్స్‌ ఇంజెక్షన్లు, కాలేయ పనితీరును పెంచే ఔషధాలు మరియు యాంటిబయోటెక్‌ ఇంజక్షన్‌న్లు వేయించాలి.

ఇంజక్షన్‌ అట్రోపిన్‌ సల్ఫేట్‌, ఇంజక్షన్‌ హిమ్‌-పాం (ప్రాలిడోక్సయం) వంటి యాంటీ డోట్‌ మరియు డీ టాక్షీఫయింగ్‌ మందులను వాడాలి.

డా||. జి. రాంబాబు, పశువైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184