మార్గదర్శి ‘సారధి’ – అతడే ఒక సైన్యం

‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అన్నారు మాజీ ప్రధాని పి.వి నరసింహారావు. కన్న తల్లిని, మాతృభూమిని మరచిపోయి సుదూరతీరాలకు తరలి వెళ్ళిపోయేవారు ఎందరో! ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే పట్టణాలలో, నగరాలలో మకాంపెట్టి స్వగ్రామాలను విస్మరిస్తున్న సంస్కృతి ప్రబలుతున్న నేపధ్యంలో ఒక యువకుడు గ్రామసీమలలోనే ఉంటూ, నమ్ముకున్న చేనును సాగుచేసుకుంటూ, తాను సంపాదించుకొన్న విజ్ఞానాన్ని 10 మంది రైతులకు పంచిపెడుతూ నవజీవన సోపానానికి ‘సారధి’గా ముందుకు వెళుతున్నారు ఆయనే సారధి నాయుడు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో సంక్షుభిత వ్యవసాయానికి, దిగాలుపడి, దగాకు గురవుతున్న రైతు మానసిక స్థితికి శస్త్ర చికిత్సచేసే డాక్టరుగా అగ్రి క్లినిక్‌ను ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడుగా విజ్ఞానాన్ని గ్రామసీమలకు చేర్చే పనిలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఇతర వ్యవసాయిక ఉత్పత్తి ప్రేరేపిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సారధి నాయుడు నూటికి నూరుపాళ్ళు స్వచ్ఛమైన, గర్వకారణమైన రైతుబిడ్డే. తన స్వానుభవాన్ని ‘అగ్రి క్లినిక్‌’ మాసపత్రిక ప్రతినిధితో పంచుకున్న సారధినాయుడు తన కార్యకలాపాలపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

తండ్రి మార్కొండనాయుడి బాటలో సస్యరక్షకుడిగా, ఆకుపచ్చ విప్లవ వీరుడిగా ఎన్నో మహత్తర కార్యక్రమాలను వంటిచేత్తో చేపట్టారు. 40 ఎకరాల భూమిలో బొప్పాయి, అరటి , పుచ్చ తోటలను సాగుచేస్తున్నారు. అదేవిధంగా టమోటా, వంకాయ వంటి కూరగాయలను తన నైపుణ్యతతో ప్రామాణిక ఉత్పత్తి తీస్తూ సంచార వాహనం ద్వారా మార్కెట్‌కు తరలిస్తారు. స్వయంగా బిందు, తుంపరల సేద్యం ద్వారా 40 ఎకరాలలో అత్యంత ఫలసాయాన్ని ఎలా పొందవచ్చో స్వానుభవాన్ని మాటలలో చెప్పకుండా, తన వ్యవసాయ క్షేత్రంద్వారా అందరికీ చూపిస్తారు. అంతేకాకుండా గత 10సంవత్సరాలుగా 30 మందికి శాశ్వత ఉపాధికల్పిస్తూ పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో తెలియజెప్పారు. సారధి నాయుడు ప్రారంభించిన అగ్రిక్లినిక్‌లో సలహాలు పొందేవారు సగటున నెలకు 700 మంది ఉంటారంటే ఆశ్చర్యపడక తప్పదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు చేసే పనిని ‘‘అతడే ఒక సైనికుడిలా’’ నిలచి స్పూర్తి ప్రదాతగా చిన్న వయసులోనే పేరుపొందారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు తోడ్పడే ఎరువులు, విత్తనాలు, నర్సరీ ఉపకరణాలు, షేడ్‌నెట్‌లు, భూమి అవసరం లేకుండా సాగుకు మాధ్యమంగా ఉండే కోకోఫిట్‌ వంటి వాటిని సరఫరా చేస్తూనే వాటి వినియోగం పై రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు. వ్యవసాయానికి సాగునీరు సరఫరా క్లిష్టమవుతున్న తరుణంలో అందుబాటులోకి వచ్చిన బిందుసేద్యానికి ఈ ప్రాంతంలో ఆద్యుడిగా ప్రాచుర్యం పొందిన సారధినాయుడు 11 మండలాల్లో నెటాఫిన్‌ ఇరిగేషన్‌ సంస్థకు డీలరుగా ఉన్నారు. బిందుసేద్య పరికరాలను సరఫరా చేయడంతో పాటు ఆ పధకం అమలుకు కావలసిన అన్ని సలహాలను అందిస్తూ, నీటియాజమాన్యంపై రైతులకు మార్గదర్శకంగా ఉన్నారు. తోటల పెంపకానికి ప్రాధమికంగా తోడ్పడే నర్సరీని కూడా ప్రారంభించారు. దీనిలో షేడ్‌నెట్‌ విధానంలో తోటల పెంపకం, కూరగాయల విత్తనాలు నాణ్యమైన బొప్పాయి విత్తనాలను పండిస్తారు. జర్మినేషన్‌ ట్రేలలో కూరగాయలనారు పెంచడంలో మంచి నైపుణ్యం సాధించారు. పండిరచిన పంటకు గిట్టుబాటులేని పరిస్థితులలో పలుచోట్ల రైతులు ఆత్మక్షోభకు గురౌతుంటే దానికి పరిష్కార మార్గం కూడా సారధినాయుడే కనుగొన్నారు. మార్కెటింగ్‌కు కావలసిన వాహన సౌకర్యాలను సమకూర్చుకుని, స్ధానిక మార్కెట్లకు తనతోపాటు తోటిరైతుల ఉత్పత్తులను కూడా తరలించడం విశేషం. అంతేకాకుండా తిరుపతిలో, మదనపల్లి ఇతరపట్టణాలలో పండ్లు, కూరగాయల అమ్మకపు కేంద్రాలను స్వయంగా ప్రారంభించి రైతులకు మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగుపరచారు. సారధినాయుడు స్వచ్ఛంద సేవా నిరతి, నిరంతర రైతులకు విజ్ఞాన ప్రధానం, వారి కష్ట నష్టాలలో తానూ ఒకడిగా ఉంటూ మమేకం కావడం చాలా అరుదైన విషయం. రెండో హరిత విప్లవానికి దేశం సన్నద్ధమవుతున్న సమయంలో సారధిలాంటి విద్యావంతులు, నవయువకులు ఊరూరా సస్యరధానికి సారధులుగా అవతరిస్తే ఇక దేశం నందనవనమే.