నేలతల్లి తుళ్ళింత – రైతుబిడ్డ పులకరింత

ఆంధప్రద్రేశ్‌ ధాన్యాగారంగా గుంటూరు జిల్లాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ పండే మిర్చికి భారతీయ మార్కెట్లో ఎంతో వాణిజ్య విలువ ఉంది. పత్తి పండిరచడంలో గుంటూరు జిల్లాకు ఉన్న విశిష్టత దేశంలోని మరే జిల్లాలోనూ కానరాదు. దిగువనున్న డెల్టా ప్రాంతంలో వేల టన్నుల కొద్దీ వరి ఉత్పత్తి అవుతుండగా ఎగువున మెట్ట ప్రాంతాలలో పత్తి, మిర్చి, పొగాకు విస్తారంగా పండిస్తారు. కృష్ణానది తీర ప్రాంత లంకలలో ముఖ్యంగా దుగ్గిరాల ప్రాంతంలో పండే పసుపుకు అంతర్జాతీయ డిమాండ్‌ ఉంది. ఇక కృష్ణ లంకలలో అరటి, జామ, కొబ్బరిసాగు వలన రైతులు విశేషంగా లబ్ధిపొందుతారు. ప్రతిగ్రామంలో సేద్యంలో ఆదర్శ రైతులు ఒకరో, ఇద్దరో చరిత్రకెక్కుతారు. కానీ అట్టడుగున ఉన్న రైతు విజయాలను ప్రజలలోకి తెచ్చి, వ్యవసాయ వృత్తికి సంఘంలో సముచిత హోదా కల్పించే మహత్తర కార్యక్రమంలో భాగంగా తనవంతు బాధ్యతగా రైతు విజయగాధలను అగ్రిక్లినిక్‌ మీ ముందుకు తెస్తుంది.

ఆరుగాలం కష్టపడి పండిరచినా చివరకు గిట్టుబాటు ధరలేక, మార్కెట్లో పోటీ పడలేక, మార్కెటింగ్‌ సౌకర్యాలు అరకొరగా ఉండడంతో వ్యవసాయం దండగమారి పని అని పెక్కుమంది భూములను వదిలి పట్టణాలకు వలసపోతున్న సందర్భంలో కొంతమంది రైతులు, ముఖ్యంగా విద్యాధికులు కూడా తిరిగి గ్రామాలకు తరలివచ్చి సేద్యాన్ని ప్రధాన వృత్తిగా మార్చుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోకడలతో అధికదిగుబడులు సాధిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న నేపధ్యంలో ఆయా రైతుల అనుభవాలను ఇతర రైతులకు అందజేయడానికి అగ్రిక్లినిక్‌ వారి సేద్యరీతులను, భావాలను మీ ముందుంచుతుంది.

వ్యవసాయం ప్రకృతి ప్రసాదించిన వరం…… వడ్లమూడి పవిత్ర భావంతో వ్యవసాయ వృత్తికి అంకితం కావడం ద్వారా ఆత్మసంతృప్తి రైతుకు, ఆహార భద్రత దేశానికి లభిస్తుందనే ఉదాత్త భావాలుగల వడ్లమూడి రవీంద్రనాథ్‌ సేద్య రంగంలో తనదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నారు. పత్తి, మిర్చి దిగుబడులను ప్రతికూల పరిస్థితులను ఏ ఏటికాయేడు అధిగమిస్తూనే దిగుబడుల రంగంలో రికార్డులు స్థాపిస్తున్నారు. గుంటూరుజిల్లా, తాడికొండ మండలం, నిడుముక్కల గ్రామంలో జన్మించిన రవీంద్రనాథ్‌ తాడికొండ డిగ్రీ కళాశాలలో పట్టభద్రుడైనారు. ఉన్నత విద్యావంతుడైనప్పటికీ వ్యవసాయంపై మక్కువతో జన్మించిన గ్రామాన్ని, నమ్ముకుని పూజించే వ్యవసాయభూమిని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చదువుకునే రోజలనుండే సేద్యం ఎదుర్కొంటున్న కష్టాలను చవిచూస్తూ హరిత విప్లవాన్ని కోరుకునే వారిలో ప్రధముడిగా శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తండ్రి వారసుడిగా సేద్య జీవనంలోకి అడుగుపెట్టిన వడ్లమూడి 64 ఎకరాలలో పత్తి, మిర్చి సాగుచేస్తున్నారు. 19 ఎకరాలలో నీటి సౌకర్యం ఉన్న భూమిలో ఎకరాకు క్రమం తప్పకుండా 30 నుండి 35 క్వింటాళ్ళ మిర్చి దిగుబడిని సాధించగలుగుతున్నారు. 45 ఎకరాలలో కేవలం వర్షంపై ఆధారపడి పత్తి పండిస్తూ ఎకరాకు 15 క్వింటాళ్ళ పత్తి దిగుబడిని సాధిస్తున్నారు. సరైన సస్యరక్షణ, నీటి యాజమాన్యంతో ఈ దిగుబడులను విజయవంతంగా సాధిస్తున్న రవీంద్ర వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, అవరోధాల గురించి అగ్రిక్లినిక్‌ ప్రతినిధితో మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న వాళ్ళు, పవిత్రమైన వ్యవసాయ వృత్తిని చేపట్టిన రైతు, సమస్యలకు జడిసి మడమతిప్పి వెనుకడుగు వేయరాదని, ‘సమస్య ఎక్కడుందో, పరిష్కారం అక్కడే వెతుక్కో’వాలని అన్నారు. కూలీల సమస్యను పెద్ద బెడదగా అభివర్ణించి భయపడరాదని. వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న కూలీలకు తగిన వేతనం చెల్లించడం ద్వారా రైతు వారి సహకారాన్ని పొందడం కర్తవ్యంగా భావించాలని సూచించారు. సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించవలసిన అవసరం ఉందని, ఒక దశలో కూలీల కొరత బాగా పీడిరచిన సమయంలో తాను బీహార్‌నుండి వ్యవసాయ కూలీలను రప్పించి పని చేయించుకున్నానని తెలిపారు. 1996లో తన తండ్రి అజమాయిషీలో వ్యవసాయాన్ని ప్రారంభించిన తాను కొంతకాలం పాటు పత్తి సేకరణ కొరకు 1,92,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం పై పయనించానని, పత్తి కాటాలలో మోసం దాగి ఉండడం, ఇతర అనేక లోపాయకారి విధానాలు తనను బాధించాయని, అందుకే వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించి పవిత్ర భావంతో ముందుకు వెళుతున్నానని వివరించారు. ‘‘శ్రమయేవజయతే’’ అనే పెద్దల నానుడిని తూచా తప్పక పాటిస్తూ రైతుగా స్వావలంబనకు చేరుకున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. రవీంద్ర రైతుగా తానొక్కడే విజయం సాధించడం కాకుండా, రోజుకు 20 నుండి30 మంది రైతులకు సలహాలను ఇచ్చి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తుంటారు. ఒక గ్రామంలో నాలుగు వైపులా భూమి ఉండాలని వెనుకటికి మన పెద్దలు భావించేవారని, గ్రామపరిధిలోనే వర్షపాతం ఒకేరకంగా ఉండకపోవడం గమనించామని, పంటల భీమాపథకంలో లోపభూయిష్ట విధానం వలన రైతుకు న్యాయం జరగడంలేదని అన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని బీమాను వర్తింపచేయడం సమంజసం కాదని, రైతును యూనిట్‌గా తీసుకుని పథకాన్ని వర్తింపచేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. నిడుముక్కలలో ఇప్పటికే తన విశేష అనుభవంతో సేద్యం ద్వారా సిరులు పండిస్తున్న రవీంద్ర అనుభవాలు ఇక్కడికి వచ్చే రైతులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా మళ్ళించాలని కోరుకునే రవీంద్ర రాష్ట్రప్రభుత్వం స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులను అమలు చేస్తున్నామంటూ, రాజకీయ కార్యకర్తలను ఆదర్శరైతులుగా నియమించడం వలన ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. 1996లో మొదలుపెట్టి ఇప్పటి వరకు కేవలం వ్యవసాయంపై కోటిన్నర రూపాయలు ఆర్జించి, బడాకాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగులతో సమానంగా 40 లక్షల రూపాయలతో అత్యంత ఆధునిక భవనాన్ని నిడుముక్కల గ్రామంలో నిర్మించుకుని రైతుగా గర్విస్తున్నానని వడ్లమూడి అన్నారు. నిరాశతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టకుండా, పోరాటపటిమతో సమస్యలకు ఎదురొడ్డి నిలచి మనుగడ సాగించాలని ఆయన తోటి రైతులకు ఆత్మ విశ్వాసాన్ని నిరంతరం కల్గించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదర్శ సేద్యానికి చిరునామాగా నిలచి, అఖండ సంపదను ఆర్జించి పెడుతున్న ఇటువంటి మట్టిలో మాణిక్యాలు జాతికి ఎంతో అవసరం. వడ్లమూడి రవీంద్రనాథ్‌ తండ్రి : సాంబశివరావు, నిడుముక్కల (గ్రామం), తాడికొండ (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9848714849.

సేద్య ‘మోహనం’ ఆదర్శ రైతుల గురించి, పంట దిగుబడులలో విజయం సాధించిన రైతుల గురించి, లక్ష్యసాధనలో వారుపడిన కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్యతరగతి రైతాంగం అనాదిగా సాంప్రదాయ వ్యవసాయంలో పెద్దగా సంపాదించింది లేకపోగా, ఉన్న దానిలోనే పొదుపు చేసుకుని పిల్లల్ని చదివించుకోవడం ద్వారా సంతృప్తి పడతారు. ఎమ్‌ఏ చదివిన తన కుమారుడు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడాన్ని ఆ తండ్రి హర్షించాడో లేదో తెలియదు కాని, తనకు పచ్చని రంగులద్దిన భూమిపుత్రుడ్ని చూసి భూమాత పులకరించిపోయింది. అతని శ్రమైక జీవన సౌందర్యానికి మెచ్చి గుత్తులు, గుత్తులుగా మిరప, పత్తిని విరగపండిరచి దీవించింది. ఇది కూడా గుంటూరు జిల్లా కథే. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన అయినంపూడి మోహనకృష్ణ ఈ సంవత్సరం 20 ఎకరాలలో చెరిసగం ఎకరాలు మిరప, పత్తి పండిరచారు. మిరప ఎకరాకు 25 ` 30 క్వింటాళ్ళ దిగుబడి రాగా పత్తి 10 ఎకరాలలో 100 క్వింటాళ్ళకు పైగా పండిరది. మిర్చి సాగులో తను సొంతంగా తయారు చేసుకున్న మిరప విత్తనాలను వినియోగించిన మోహనకృష్ణ, ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి దిగుబడి కొంచెం దెబ్బతినడం, మొజాయిక్‌ వైరస్‌ ప్రబలడంతో మిర్చి దిగుబడులు తగ్గాయని వివరించారు. గిట్టుబాటు ధర తగినంతగా ఉన్నా, మిర్చి కోత కూలి విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించిందని, మిరప తొక్కుడు, గోతాలు, కమీషన్‌, లోడిరగ్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా సరైన సస్యరక్షణ, నీటి, ఎరువుల యాజమాన్యంతో సంతృప్తి కరమైన దిగుబడులను సాధించానని తెలిపారు. పంటల భీమా పధకం రైతులను యూనిట్‌గా చేసుకుని అమలు చేయాలని సూచించారు మోహనకృష్ణ. అయినంపూడి మోహనకృష్ణ, కోయవారిపాలెం (గ్రామం), ప్రత్తిపాడు (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9948501002.

ప్రముఖుల మన్ననలు పొందుతున్న మన్నవ జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం, చింతపల్లిపాడు గ్రామరైతు మన్నవ వెంకటేశ్వరరావు గత మూడు దశాబ్దాలుగా 30 ఎకరాల భూమిలో మిర్చి, పత్తి సాగుద్వారా అధిక దిగుబడులను సాధిస్తున్నారు. 23 ఎకరాలలో వర్షాధార భూమిలో ఎకరానికి 16 క్వింటాళ్ళ పత్తి దిగుబడిని సాధిస్తున్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సహాయంతో మరో 7 ఎకరాలలో ఎకరాకు 30 క్వింటాళ్ళు మిర్చి దిగుబడిని పొందుతున్నారు. తనకు కావలసిన విత్తనాలను తానే ఉత్పత్తి చేసుకుంటూ సేద్య రంగంలో వినూత్నంగా ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం మొదటి విడత మిర్చి దిగుబడి 125 క్వింటాళ్ళను, రెండో విడత దిగుబడి 80 క్వింటాళ్ళను, మూడవ విడత 30 క్వింటాళ్ళను కోల్డు స్టోరేజిలలో భధ్రంగా పదిలపరచుకున్న ఆయన మరింత గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్నారు. మిరప సస్యరక్షణలో భాగంగా ‘మిత్ర్‌’ అనే మందు ఎకరానికి 100 మి.లీ.తోపాటు అమిస్టార్‌, ఫెగాసిస్‌ అనే మందులు విశేషంగా పంట పండటానికి ఉపయోగపడ్డాయని తెలిపారు. ఐతే మిర్చి కోతకు, పత్తి సేకరణకు విశేషంగా కూలీల ఖర్చులు పెరిగిపోవడం, భూమి కౌలు ఎకరాకు 10వేల నుండి 15వేల వరకు ఉండడం వలన తమకు ప్రతిబంధకాలుగా మారాయని మన్నవ ఆవేదన వ్యక్తం చేశారు. మన్నవ వెంకటేశ్వరరావు, తండ్రి. కోటయ్య, చింతపల్లి పాడు (గ్రామం), వట్టి చెరుకూరు (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9959739175.