Print this page..

వేసవిలో ఆకు కూరల సాగు - మెలకువలు

కూరగాయల్లో ఆకు కూరలకు విశిష్టస్థానం ఉంది. ఆకు కూరలు మనం ఆరోగ్యంగా ఉండటానికి సమతులాహారంలో చాలా అవసరం. వీటిలో మన శరీరానికి కావాల్సిన ఖజిన లవణాలు అనగా కాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్ ‘ఎ’, ‘సి’ అధికంగా ఉంటాయి.
కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ ఆకు కూరల సాగుకు ప్రతి బంధకమవుతాయి. ఆకు కూరల్లో ముఖ్యమైనటువంటి తోటకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర వంటివి వేసవి సాగుకు అనువైనవి. పాల కూరకు ఉష్ణోగ్రత 35-40 సెల్సయస్ ఉన్నచో త్వరగా పూతకు వచ్చి ఆకు నాణ్యత దెబ్బతింటుంది. కావున ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న వాతావరణంలో ఈ ఆకు కూరలను 35 లేదా 50 % షేడ్ నెట్స్ క్రింద సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు పొందగలం.
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వడగాల్పుల వలన మొక్క పెరుగుదల తక్కువగా ఉండి దిగుబడులు తగ్గుతాయి. అందువలన రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టి, ఉన్న కొద్ది నీటి వనరులకు సక్రమంగా వినియోగించుకొని ఆకు కూరల సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే రైతులు అధిక లాభాలు పొందడమే గాక నాణ్యమైన దిగుబడిని పొందగలరు.

రైతులు వేసవి ఆకు కూరల సాగుకు చేపట్టాల్సిన చర్యలు :
వేసవి సాగుకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. తోటకూర సాగుకు ఆర్.ఎన్.ఎ-1 లేదా అర్కా సుగుణ, మెంతికూరలో పూసా సువర్ణ లేదా హిస్సార్ సెలెక్షన్ అదే పాలకూరలో ఆల్ గ్రీన్ లేదా అర్క అనుపమ, కొత్తిమీరలో కల్మీ, కో-3 వంటి రకాలు అనువైనవి.
వేసవి కాలంలో ఆకు కూరలను మడులపైన విత్తుకోవాలి. 2 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు గల మడులను తయారు చేసుకోవాలి. బాగా మాగిన పశువుల ఎరువు (10 కిలోలు), కిలో వేప పిండి, సూపర్ ఫాస్ఫేట్ ను మడులలో వేసుకోవాలి. మడులలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తుకోకుండా విడతలుగా విత్తుకోవాలి. దీని వలన ఒక సమయంలో పండించిన పంట దెబ్బతిన్నప్పటికీ లేదా మార్కెట్లో ధర లేకపోయినా, ఇంకో సమయంలో విత్తిన పంట నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.
తోటకూరకు ఎకరానికి 800 గ్రా. విత్తనం సరిపోతుంది. ఈ విత్తనానికి 10 కిలోల ఇసుకను కలిపి మడులపై పలుచగా చల్లుకోవాలి. తర్వాత విత్తనాన్ని పలుచటి పొరలా మట్టితో కప్పాలి. పాలకూరకు ఎకరాకు 12 కిలోలు విత్తనం, మెంతి కూరకు 10 కిలోలు, కొత్తిమీరకు 5 కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తేముందు అన్ని రకాల ఆకు కూర విత్తనాలను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. చొప్పున కిలో విత్తనానికి, ఆ తర్వాత ట్రైకోడెర్మ విరిడి 8 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
విత్తిన వెంటనే మడులను వరిగడ్డితో కప్పాలి. దీని వలన ఎండ తీవ్రత తగ్గి, విత్తనం త్వరగా మొలకెత్తిన భూమిలో తేమను కూడా నిలిచేటట్లు చేస్తుంది. మొలకెత్తిన వెంటనే కప్పిన గడ్డిని తీసివేయాలి.
వేసవి ఆకు కూరల సాగులో ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, వేప పిండిని వాడాలి. వీటితో పాటు జీవన ఎరువులైనటువంటి అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియం లాంటివి వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేల బాగా గుల్లబారి తేమను ఎక్కువ రోజులు పట్టి ఉంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.

నీటియాజమాన్యం :
ఆకు కూరల పంటల యొక్క ఆకులు దళసరిగా ఉండి, ఎక్కువ నీటిశాతం కలిగి ఉంటాయి. కనుక వేసవిలో 3-4 రోజులకొకసారి నీటి తడులు ఇవ్వాలి. నీరు తక్కువైనట్లయితే ఆకులు సన్నగా గిడసబారిపోయినట్లు ఉండి, చిన్నవిగా వస్తాయి. అంతేకాకుండా ఈ ఆకు కూరల పంటలను సూక్ష్మ నీటిపారుదల పద్ధతుల ద్వారా పండించవచ్చు. ఈ విధానంలో డ్రిప్ పద్ధతి మరియు తుంపర సేద్యం విధానాన్ని ఉపయోగించనప్పుడు రైతులు వారి సాగు నీటిని, నీటి నాణ్యత పరీక్ష చేయించుకున్న తర్వాత మాత్రమే సాగునీటిని వినియోగించుకోవాలి.

సస్యరక్షణ :
ఆకు కూరల పంటలలో రసం పీల్చే పురుగులు పేనుబంక, పిండినల్లి, దీపపు పురుగులు, తామర పురుగులు మరియు సిల్లిడ్ నల్లి వంటి కీటకాల ఆకుల నుండి మరియు లేత కాండం నుండి రసం పీల్చుట వలన ఆకులు ముడుచుకుపోయి పసుపు రంగుకు మారి ఆకు నాణ్యత కోల్పోతుంది. ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి కూడా ఏర్పడుతుంది. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేప నూనె మొదలైనవి) మాత్రమే పంట కాలంలో 1-2 సార్లు పది రోజుల వ్యవధిలో పంటపై పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసిన 3-4 రోజుల వ్యవధిలో ఆకులను కోసుకోవచ్చు. కోసిన ఆకులను మంచి నీటితో శుభ్రంగా కడిగి వాడుకోవాలి.
ఆకు కూరల పంటల సాగులో తెగుళ్ళ నివారణకు 2 కిలోల ట్రైకోడెర్మ విరిడి, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు మరియు 10 కిలోల వేప పిండి కలిపి నీళ్ళు జల్లి వారం రోజులు మగ్గిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వలన నేల ద్వారా ఆశించే తెగుళ్ళను అరికట్టవచ్చు.

దిగుబడి :
పాలకూర : ఎకరాకి 3-4 టన్నులు
తోటకూర : ఎకరాకి 3-3.5 టన్నులు
మెంతికూర : ఎకరాకి 2.5 - 3 టన్నులు
కొత్తిమీర : 2.5 - 3 టన్నులు ఒక ఎకరాకి దిగుబడినిస్తాయి.

రచయిత సమాచారం

కె. చైతన్య, డా. టి.ఎల్. నీలిమ, డా. మొహమ్మద్ లతీఫ్ పాషా మరియు డా.ఎం.ఉమాదేవి నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం రాజేంద్రనగర్